తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్ స్కూల్‌ పేరు మీద లేఖతో పబ్‌లో పార్టీకి అనుమతి

Excise Dept On Amneshiya pub: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచార ఘటనపై అబ్కారీ శాఖ అప్రమత్తమైంది. పబ్​లోకి మైనర్లను ఎలా అనుమతించారన్న విషయంపై ఆరా తీశారు. పబ్​లో సీసీటీవీ ఫుటేజిని పరిశీలించిన అబ్కారీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.

Excise Dept On Amneshiya pub:
అమ్నేషియా పబ్

By

Published : Jun 4, 2022, 7:16 PM IST

Updated : Jun 4, 2022, 7:24 PM IST

Excise Dept On Amneshiya pub: అమ్నేషియా పబ్ ఘటనపై అబ్కారీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మైనర్లను పబ్‌లోకి ఎలా అనుమతించారన్న విషయంపై ఆరా తీశారు. పబ్ యాజమాన్యం నుంచి అధికారులు వివరాలు సేకరించారు. ఈ నెల 28న ఓ కార్పొరేట్ స్కూల్‌ పేరు మీద లేఖతో పబ్‌లో అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే వాళ్లకు మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లేవని అధికారులు తేల్చేశారు. భవనంలోని నాలుగో అంతస్తులో పార్టీకి అనుమతిచ్చినట్లు తెలిపారు. సమగ్ర నివేదిక సిద్ధం చేసి అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.

ఈ నెల 28న పార్టీ చేసుకునేందుకు ఓ కార్పొరేట్ స్కూల్‌కు చెందిన సీనియర్‌ విద్యార్ధి అమ్నేషియా పబ్ మేనేజర్‌ను కలిసి రూ.2 లక్షలు అడ్వాన్స్‌ చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 150 మందికి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించగా.... 180 మందికిపైగా హాజరైనట్లు యాజమాన్యం వెల్లడించిందని ఎక్సైజ్‌ అధికారులు వివరించారు. వాస్తవానికి పబ్​లో మద్యం, ఆహార పదార్థాలు, పబ్‌, ఫంక్షన్లు చేసుకోడానికి ఇలా నాలుగు ఫ్లోర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే వీరికి నాలుగో అంతస్తులో పార్టీ చేసుకునేందుకు అనుమతించినట్లు వెల్లడించారు. అందరూ మైనర్లు కావడం వల్ల.. నాలుగో అంతస్తులోకి మాత్రమే రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నట్లు పబ్ యాజమాన్యం తెలిపింది. ఇతర అంతస్తుల్లోకి వెళ్లకుండా బౌన్సర్లను పెట్టడంతో పాటు లిప్టు కూడా ఆ ఫ్లోర్‌కే ప్రత్యేకంగా కేటాయించినట్లు పబ్‌ మేనేజర్‌ వెల్లడించారని అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించిన అబ్కారీశాఖ అధికారులు మద్యం సరఫరా జరగలేదని తేల్చేశారు.

Last Updated : Jun 4, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details