ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆశా కార్యకర్తలకు.. ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్లో భాగంగా నేడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అసలు ఈ వయసులో పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా తెలియదంటూ కొందరు వృద్ధులు వాపోయారు. మరికొందరికి అసలు రాయటం కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాయకుంటే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయేమోనని వారి పిల్లలను వెంటబెట్టుకుని పరీక్షలు రాసేందుకు వచ్చారు.
ఆశా వర్కర్‌ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తామోనని.. ఇలాంటి పరీక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి అనేక వ్యయప్రయాసలతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1585 మంది హాజరు కాగా.. తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.