కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రతి ఒక్కరు తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ (covid vaccine) తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస రావు (dh srinivas rao) పేర్కొన్నారు. కోఠీలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన.... రాష్ట్రంలో ప్రస్తుతం తొలిడోస్ తీసుకుని గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోని వారి సంఖ్య 36 లక్షలకు చేరిందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. (should be take in two doses covid vaccine).
ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొవిడ్ కేసుల్లో అసలు టీకా తీసుకోని వారు 60 శాతం వరకు ఉండగా, మరో 30 శాతం మందికి ఒకడోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారే అని స్పష్టం చేశారు. రెండు డోసులు పూర్తైన వారిలో కేవలం ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే కొవిడ్ సోకుతోందని పేర్కొన్నారు. అలాంటి వారిలో సైతం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవడం లేదని వివరించారు. ఇక చిన్నారులకు సైతం త్వరలో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందన్న డీహెచ్.... జైడస్ క్యాడిలా టీకాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 50లక్షల వరకు వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నప్పటికీ... 75 శాతం జనాభా మొదటి డోసు తీసుకున్నప్పటికీ... రెండో డోసు తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ డోసు తీసుకుని రెండో డోసు తీసుకోని వారు రాష్ట్రంలో 36 లక్షల మందికి పైగా ఉన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అశ్రద్ధ చేయడం వల్ల చాలా మంది రెండో డోసు వేయించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని 20 శాతం మందిలో సుమారు 60 శాతం మంది వైరస్ బారిన పడుతున్నారు. వారిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. - శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు