బాల్యంలో అమ్మకొంగు చాటులో పెరిగిన ఓ సాధారణ ఆడపిల్లను...సొంతంగా నిర్ణయం తీసుకోలేని మహిళను.. సమాజంలో ధైర్యంగా బయటకు రాలేని ఓ అభాగ్యురాలిని... ఎదురు మాట్లాడలేని నిశ్చేయురాలని... స్వేచ్ఛకు సంకేళ్లు వేసినా... ఏమి అనలేని ఓ సాధారణ మగువను.
అమ్మగా, భార్యగా, కూతురిగా, సోదరిగా ఇన్ని పాత్రలు పోషించే నాకు స్వేచ్ఛే లేదు. చిన్నతనమంతా నాన్న నీడలోనే. వయస్సు రాగానే పెళ్లి. భర్త అడుగుజాడల్లో ప్రయాణం. తర్వాత పిల్లలు...వాళ్ల ఆలనా పాలనా. వృద్ధాప్యంలో మళ్లీ వారసులు చెప్పినట్లే వినాలి. నాకంటూ స్వేచ్ఛ లేదా.. ! ఎవరి మీద ఆధారపడకుండా నా స్వశక్తితో బతకాలనుకుంటున్నాను.
పక్కనే ఉన్న షాపుకు వెళ్లాలంటే నా కన్న చిన్నవాడిని తోడుగా ఇచ్చి పంపుతారు. ఏదైనా చెప్పాలంటే భయం.. సొంతంగా నిర్ణయం తీసుకుంటే... నీకేం తెలుసు.. మేం చెప్పింది చేయ్ అంటారు. మీ పెంపకంలో నేను ఆలోచించడమే మర్చిపోయాను. ఇప్పుడు నేను ఏదైనా చేయాలంటే... మరొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. నాకు ఆలోచించాలనే ఆలోచనే రావడం లేదు.