హైదరాబాద్‌లోని పలు పబ్బులు అర్ధరాత్రి దాటే వరకు నడుస్తున్నా.. కొన్నింటిలో మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నా అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో కొందరు యువతీయువకులు వీరంగాలు సృష్టిస్తున్నారు. బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లీగంజ్‌పై జరిగిన దాడి తాజా నిదర్శనం. పబ్బుల్లోకి ప్రవేశించాక ఆ వాతావరణానికి 90 శాతంమంది విచక్షణ కోల్పోయి ప్రవరిస్తున్నారు. యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవరిస్తున్నారు. ప్రశ్నిస్తే దాడి చేసేందుకూ వెనుకాడటం లేదు. కొందరు రాజకీయ నాయకుల కుమారులు పబ్బుల్లోనే సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని కొన్ని పబ్బుల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
- పటాన్‌చెరుకు చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమారుడు ఓ యువ కథానాయికను వేధించి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- మాదాపూర్‌లోని ఓ పబ్‌కు వెళ్లిన యువ ఐపీఎస్ అధికారి బిల్లు విషయంలో నిర్వాహకులతో గొడవపడి సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించాడు.
- జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో బిల్లు ఎక్కువ వేశారని వినియోగదారుడు ప్రశ్నిస్తే.. బౌన్సర్లతో దాడి చేయించారు.
రాయితీలంటూ వల..
పుట్టినరోజు, వీడ్కోలు, ఫ్రెషర్స్ డే.. వేడుక ఏదైనా తమ పబ్బుల్లో చేసుకుంటే రాయితీలు ఇస్తామంటూ నిర్వాహకులు ఊరిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా సమావేశ గదులు ఏర్పాటు చేస్తామని ఆశ చూపుతున్నారు. మద్యం, భోజనం బిల్లు రూ. 25,000 దాటితే 15 శాతం, రూ.50,000 దాటితే 20 శాతం రాయితీ ఇస్తామంటూ వివరిస్తున్నారు. కేక్‌ల వంటివి ఉచితంగా ఇస్తామంటున్నారు. దీనితో కొందరు విద్యార్థులు నెలలో కనీసం రెండుసార్లయినా పబ్బులకు వెళ్తున్నారు. బషీర్‌బాగ్‌లోని ఓ విద్యాసంస్థకు చెందిన ఇంటర్ విద్యార్థినుల్లో కొందరు వీడ్కోలు వేడుకల కోసం బంజారాహిల్స్‌లోని ఓ పబ్బుకు వెళ్లారు. వారు మైనర్లని తెలిసినా నిర్వాహకులు మద్యం సరఫరా చేశారు.