- కరోనా కారణంగా సాంకేతిక విద్యపై ఎలాంటి ప్రభావం పడింది? ప్రస్తుతం ప్రభుత్వం, విద్యాసంస్థలు అనుసరించాల్సిన వ్యూహాలేమిటి?
సాంకేతిక విద్యే కాదు, మొత్తం విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇంజినీరింగ్‌లో చాలావరకు సబ్జెక్టులు ల్యాబ్ వర్క్స్‌తో ముడిపడి ఉండటంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చేందుకు విద్యాసంస్థలు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. బోధన కూడా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది కనుకే పరీక్షల విధానంలోనూ మార్పులు వచ్చాయి. ట్రిపుల్‌ఐటీలో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, వైవా, క్విజ్ ద్వారా గ్రేడ్లను ఇస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమ బోధన పద్ధతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం ఆన్‌లైన్ పాఠాలు వినే సౌకర్యం కల్పించాలి. - గతేడాది ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ రద్దు చేసి మెయిన్స్ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని మీరు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధానం అనుసరణీయమేనని భావిస్తున్నారా..?
ప్రస్తుతం పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఫిబ్రవరి, మార్చిల్లో రెండుసార్లు జేఈఈ మెయిన్స్ జరిగింది. ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని నిర్వహించాకే మెయిన్స్ ర్యాంకులు ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) భావిస్తున్నట్లుగా సమాచారం ఉంది. దీనివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్ మరింత జాప్యమయ్యే వీలుంది. అందుకే రెండు ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నా. ఒకటి.. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను ఒకే పరీక్షగా నిర్వహించవచ్చు. రెండోది..ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆధారంగా కాకుండా మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. ఐఐటీ ప్రవేశాలు ఆలస్యమైతే ఆ ప్రభావం మిగిలిన ప్రవేశాలపై పడుతుందని నిర్వాహకులు గుర్తించాలి. - ప్రస్తుతం బోధన, పరిశోధన కార్యక్రమాలను ట్రిపుల్‌ఐటీ ఏ విధంగా నిర్వహిస్తోంది..?
బోధన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొనసాగుతోంది. వీలైనంత త్వరగా క్యాంపస్‌లో తరగతులు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. పరిశోధనలు ఎక్కువగా కంప్యూటర్లపైనే సాగుతుండటంతో వ్యక్తిగత సంప్రదింపులు తగ్గిపోయాయి. గతేడాది చివరి నుంచి కరోనా రెండో దశ ఉద్ధృతి పెరిగే వరకు 40 శాతం మంది పరిశోధక విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉండి పరిశోధనలు కొనసాగించారు. - ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు ఆన్‌లైన్ విద్యకు ఎంతమేరకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు?
తరగతి గది బోధనకు ఆన్‌లైన్ బోధన ప్రత్యామ్నాయం కాదు. అధ్యాపకులు ఆన్‌లైన్ వనరులను వినియోగించుకుని బోధనను మెరుగుపరుచుకోవాలి. ఆన్‌లైన్ వ్యవస్థ భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక కోర్సులకు కీలకం అయ్యే అవకాశముంది. వేర్వేరు విద్యా సంస్థల్లో అందించే కోర్సులను విద్యార్థులు ఒకేసారి ఎంచుకుని అభ్యసించేందుకు వీలు కలుగుతుంది. - ఇంజినీరింగ్ విద్యను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ట్రిపుల్ ఐటీ తరఫున ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తారా..?
సాంకేతిక విద్యను విద్యార్థికి అర్థమయ్యే భాషలో బోధించడం ప్రోత్సహించాల్సిన అంశమే. ఈ విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలు, సంపూర్ణమైన సన్నద్ధత ఉండాలి. ప్రాంతీయ భాషల్లో అందించే ఇంజినీరింగ్ విద్య.. ప్రస్తుతం ఐఐటీల్లో లభించే ఇంజినీరింగ్‌కు సమానంగా ఉంటుందా? తదితర అన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి. సరైన ప్రణాళిక లేకుండా ఇంజినీరింగ్ విద్యను ప్రాంతీయ భాషల్లో అందించాలనుకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. భావోద్వేగాలను పక్కనపెట్టి సరైన విశ్లేషణ, ఆచరణాత్మక విధానం అనుసరిస్తే మేలు. ట్రిపుల్ ఐటీ ద్వారా మాత్రం ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యను అందించే ప్రణాళికలేవీ లేవు. - విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది, విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి?
పాఠశాల, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ పూర్తయితేనే విద్యాసంస్థలను ప్రారంభించే అవకాశముంటుంది. అందువల్ల ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నాం.
JEE MAINS: జేఈఈ మెయిన్స్ ర్యాంకులతోనే.. ఐఐటీల్లో ప్రవేశాలు మేలు - jee mains
ప్రస్తుత పరిస్థితులలో జేఈఈ మెయిన్స్ ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించడం మేలని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), హైదరాబాద్ సంచాలకులు ప్రొ. పీజే నారాయణన్ అన్నారు. ఐఐటీల్లో ప్రవేశాలు ఆలస్యమయ్యే కొద్దీ ఆ ప్రభావం ఇతర విద్యాసంస్థల్లోని ప్రవేశాలపైనా పడుతుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘ఈటీవీ భారత్’తో ముఖాముఖిలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
జేఈఈ మెయిన్స్