Etela Rajender fires on CM KCR : మేధావులు, విద్యావేత్తలు, సంఘాల నేతలతో మేధోమథనం జరిగిందని.. ఈ సమావేశంలో తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఎట్లా మోసగించారనే అంశాలపై చర్చించినట్లు బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. విద్యా వ్యవస్థను మొత్తం కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో తెలంగాణ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో మేధావులు, విద్యా వేత్తలు, ప్రజా సంఘాలతో నిర్వహించిన సమావేశంలోఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల.. సీఎం కేసీఆర్,బీఆర్ఎస్ సర్కార్ను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Etela Rajender Comments on Education System : ప్రభుత్వ విశ్వవిద్యాలయాల స్థానంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తీసుకువచ్చి పేదవాడికి విద్యను దూరం చేస్తున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది పోలీసు శాఖలోనేనన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఆత్మగౌరవం కోల్పోయారని అన్నారు. పోలీసులు అవినీతిపరులకు రక్షణగా నిలిచారని ఈటల విమర్శించారు.
ప్రతి తెలంగాణ బిడ్డపైన కేసీఆర్ అప్పు మోపారు : వ్యాపార వేత్తలకు చౌకగా భూములు కట్టబెట్టేందుకు ధరణిని తీసుకువచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి దేవుడెరుగు.. ఉన్న భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. ప్రతి తెలంగాణ బిడ్డపైనసీఎం కేసీఆర్ అప్పు మోపారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వచ్చే నెల 6వ తేదీన సభ నిర్వహిస్తున్నామన్న ఈటల.. ప్రజా సమస్యల సమాచారాన్ని బుక్ లెట్ రూపంలో తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు.