Etela Rajender Counter On MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో విషయంలో కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతోందని ఈటల స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. తెలంగాణ చాలదన్నట్లు.. దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం దిల్లీ మీద పడిందని ఆరోపించారు.
కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌కు బీజేపీ కాదని కేసీఆర్ ప్రభుత్వమని విమర్శించారు. టీఆర్ఎస్ను మట్టి కరిపించే శక్తి బీజేపీ మాత్రమే ఉందని అన్నారు. దర్యాప్తు సందర్భంగా సిట్ నివేదికలోని అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి తెరతీసిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కానిస్టేబుల్ కిష్టయయ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే నూతన మెడికల్ కాలేజీకి.. కిష్టయ్య పేరు పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్థంతిని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఈటల రాజేందర్‌తోపాటు ముదిరాజ్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
"దిల్లీలో లిక్కర్ స్కామ్ అని వార్తలు వస్తున్నాయి.. అందులో ఎవరెవరూ ఉన్నారో దర్యాప్తు సంస్థలు నిగ్గదీస్తాయి. ఎవరి పాత్ర ఉందో వారు ఎంత దండుకున్నారో వారు బయటపెడతారు. ఈ కేసులో ఉన్న వారి పేర్లు బయటపెట్టి చట్టబద్ధంగా శిక్షించాలి." - ఈటల రాజేందర్, ఎమ్మెల్యే