తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో మందుల కుంభకోణం - esi

ఈఎస్‌ఐ ఆసుపత్రి మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. నిబంధనలకు ఉన్నతాధికారులు తూట్లు పొడిచారు. తప్పనిసరిగా పాటించాల్సిన ఈ-టెండరు విధానానికి  మంగళం పాడారు. ఒకే కుటుంబానికి చెందిన బినామీ సంస్థలకు మందుల టెండర్లను అప్పజెప్పారు. ఈ విషయమై విచారించిన నిఘా వర్గాలు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి.

ఈఎస్​ఐ కుంభకోణం

By

Published : May 21, 2019, 4:48 PM IST

మందుల కొనగోళ్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు ఈఎస్​ఐ అధికారులు. ఒకే కుటుంబానికి చెందిన బినామీ సంస్థలకు కోట్ల విలువైన మందుల టెండర్లను కట్టబెట్టారు. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై లోతుగా విచారించిన నిఘా వర్గాలు ఇటీవలే తెలంగాణ సర్కారుకు నివేదిక అందజేశాయి. ఔషధ కొనుగోళ్ల అక్రమాల్లో ఈఎస్‌ఐ డైరెక్టర్‌, ఇద్దరు సంయుక్త సంచాలకులు, ఔషధ నిల్వ సహాయ సంచాలకులు, ఇద్దరు ఫార్మాసిస్టుల పాత్ర ఉందని నిఘా నివేదిక వెల్లడించింది. వీరందరిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది.

పరిశీలనే లేదు

సాధారణంగా డిస్పెన్సరీల నుంచి సంయుక్త సంచాలకులకు ఫలానా మందులు కావాలని అభ్యర్థన వస్తుంది. అవి రాగానే అవసరమా? కాదా? అని పరిశీలించాలి. అలా చేయకుండా నేరుగా డైరెక్టర్‌కు పంపించారు. డైరెక్టర్‌ కూడా చూసి చూడనట్లు స్వల్ప మార్పులు చేసి కొనుగోలు ఉత్తర్వులను ఔషధ సంస్థలకు పంపించారు. ఔషధ నిల్వ కమిటీని ఏర్పాటుచేసి మందుల కొనుగోళ్లకు తప్పనిసరిగా ఆ కమిటీ ఆమోదం పొందాలి. అయితే 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలలో కమిటీలను ఏర్పాటే చేయలేదు.

నిబంధనలకు తూట్లు

టెండరులో తక్కువ ధరను పొందుపర్చిన (ఎల్‌1) సంస్థకు ఔషధ సరఫరా బాధ్యతను అప్పగిస్తారు. ఒకవేళ ఆ సంస్థ మందులను సరఫరా చేయలేని పరిస్థితుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వాటికి అవకాశమిస్తారు. అయితే ఇక్కడ అలాంటి ప్రయత్నమే జరగలేదు. మందులను సరఫరా చేయనందుకు ఎల్‌1 సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న వాటితో సంప్రదించకుండా నేరుగా విపణిలో అత్యధిక ధరలతో మందులను కొన్నారు.

ఎక్కువ ధర

ఉదాహరణకు... ముందే కుదుర్చుకున్న ఔషధ ధరలో ఎల్‌1 టెండర్‌ ధర ‘హ్యూమన్‌ ఇన్సులిన్‌’ 10ఎంఎల్‌ వాయిల్‌కు రూ.66.72 ఉండగా.. దీన్ని బహిరంగ విపణిలో రూ.139.59 చొప్పున కొన్నింటినీ, రూ.122.82 చొప్పున మరికొన్నింటిని కొన్నారు. అలా పదుల రకాల మందులను లక్షల్లో కొన్నారు. ఫలితంగా రూ.కోట్లలో వ్యత్యాసం వచ్చింది. 2016-17లో ఒప్పంద ధరల ప్రకారం రూ.113.91 కోట్ల మందులు.. విపణి ధర ప్రకారం 101.66 కోట్ల విలువ కలిగినవి కొన్నారు. 2017-18లో ఒప్పంద ధరలో రూ.142.87 కోట్లవి.. విపణి ధర ప్రకారం రూ.66.60 కోట్లవి కొన్నారు.

ఒకే కుటుంబానికి

కొనుగోళ్లలో ఎక్కువ సంస్థలకు అవకాశమివ్వడానికి అనుకూలంగా విస్తృత స్థాయిలో అసలు ప్రచారమే నిర్వహించలేదు. రూ.25 లక్షలు, ఆ పైన నిధులను ఖర్చుపెట్టాలంటే తప్పనిసరిగా టెండరుకు వెళ్లాలి. పేరున్న పత్రికల్లో టెండరు ప్రకటనలివ్వాలి. అలా చేయకుండా ఒకే కుటుంబానికి చెందిన కొన్ని సంస్థలకు 2016-17, 2017-18ల్లో దాదాపు రూ.210 కోట్లకు పైగా సరఫరా బాధ్యతలు అప్పగించారు. ముందే కుదుర్చుకున్న ఒప్పంద ధర విధానంలో కాకుండా ఎందుకు అధిక మొత్తంలో అప్పటికప్పుడు కొత్త ధరలతో కొనుగోలు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ వద్ద సరైన సమాధానమే లేదు. ‘అత్యవసర పరిస్థితుల దృష్ట్యా’ కొనాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. అంటే అసలు ఔషధ నిల్వలెన్ని ఉన్నాయి? ఎంత మోతాదులో ఖర్చయ్యాయి? ఎంత కొనుగోలు చేయాలనే స్పష్టమైన సమీక్షలేమీ డైరెక్టర్‌ నిర్వహించడంలేదని స్పష్టమవుతోంది.

ఇవీ చూడండి: నేడు ఎన్​డీఏ పక్షాల భేటీ.. ఫలితాలపై సమాలోచనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details