ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనల మేరకు కొన్ని యాజమాన్యాలకు ఈపీఎఫ్ పర్యవేక్షణలో సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేసి ఉద్యోగుల భవిష్యనిధిని నిర్వహించేందుకు సంఘం మినహాయింపు ఇస్తోంది. ఉమ్మడి ఆర్టీసీకి ఈ మినహాయింపు ఉంది. దీని ప్రకారం ఉద్యోగి వాటా, యాజమాన్య వాటను కలిపి నిధిగా ఏర్పాటు చేసి, ఆ నిధిని ఈపీఎఫ్వో మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీలో గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ నిధులను సంస్థ అవసరాలకు మళ్లించడం సకాలంలో ఉద్యోగి ఖాతాలో పీఎఫ్ చెల్లించకుండా డీఫాల్ట్ కావడం పరిపాటిగా మారింది.
హెచ్చరించినా మారలేదు...
గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సంఘం హెచ్చరించగా ఆర్టీసీ కొంత నిధిని చెల్లించింది. మళ్లీ రెండేళ్లుగా యాజమాన్య ఉద్యోగి వాటా (కార్మికుడి మూలవేతనం, డీఏ వేతనంలో 12 శాతం) చెల్లించడం లేదు. ఇలా 760 కోట్ల రూపాయలు పీఎఫ్ ట్రస్టులో జమ చేయలేదని తనిఖీలో గుర్తించారు.