'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ'.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మూడుసార్లు నిరాకరించినా.. ఎందుకు ఆయనను నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు తన పునఃనియామకంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని రమేశ్‌కుమార్‌కు కోర్టు సూచించింది. హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిమ్మగడ్డకు తెలిపింది. ఇప్పటికే ఓసారి గవర్నర్ సమయం కోరామని.. నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. గవర్నర్‌ను కలిసిన తర్వాత జరిగిన పరిణామాలను తమ దృష్టికి తేవాలని కూడా హైకోర్టు పేర్కొంది. ఈలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.