హైదరాబాద్‌లోని ముసద్దీలాల్ నగల దుకాణం నిర్వాహకుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వర్గాలు సోదాలు చేశాయి. రూ. 88 కోట్ల బ్యాంకు రుణం మోసం కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు కొనసాగాయి. నగరంలోని ఓ బ్యాంకు నుంచి గతంలో రుణం పొందిన సంస్థ.. నష్టాల కారణం చూపి వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ. 40 కోట్లు చెల్లించి రుణ ఖాతాను మూసివేయించుకుంది. అయితే సంస్థలోని స్టాక్‌ను మళ్లించడం ద్వారా నష్టపోయినట్టు చూపి వన్‌టైం సెటిల్‌మెంట్ చేయించుకున్నట్టు బ్యాంకు విచారణలో తేలింది.
ఆడిట్ నివేదిక ఆధారంగా సంస్థ నిర్వాహకులు తమను మోసగించినట్టు బ్యాంకు నిర్దరణకు వచ్చింది. ఈ మోసంపై 2019 లో ఫిర్యాదు చేయడం వల్ల బెంగళూరు సీబీఐ బీఎస్‌ఎఫ్‌సీ శాఖలో కేసు నమోదయింది. ముసద్దీలాల్ జ్యుయెలర్స్‌తో పాటు నిర్వాహకులు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.