కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ (KRMB and GRMB Gazette Implementation) మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీరు తీసుకునే అన్ని ఔట్ లెట్లను స్వాధీనం చేసేందుకు రెండు రాష్ట్రాలు ప్రాధాన్యం ఇవ్వాలని మంగళవారం నాటి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తీర్మానించారు. అందుకు అనుగుణంగా సమావేశం మినిట్స్‌ను రెండు రాష్ట్రాలకు బోర్డు పంపింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అప్పగింతపై ఆది నుంచి అభ్యంతరాలు చెబుతోన్న తెలంగాణ... అదే విషయాన్ని కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశంలోనూ తెలిపింది.
బోర్డు ప్రతిపాదనలపై కరసత్తు
బోర్డు తీర్మానం నేపథ్యంలో ప్రతిపాదనలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన సమయంలో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణకు సంబంధించిన తొమ్మిది ఔట్ లెట్లను కేఆర్ఎంబీ పేర్కొంది. అందులో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్ వే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్లు, వరద కాలువ, ఏఎమ్మార్పీ పంప్‌హౌస్ ఉన్నాయి.
ఇంజినీర్లు ఏమి చెప్పారంటే...
బోర్డు పంపిన ప్రతిపాదనలపై ఏం చేయాలన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది (KRMB and GRMB Gazette Implementation). ఔట్లెట్ల అప్పగింత, నిబంధనలు, వాటికి సంబంధించిన అంశాలు, పర్యవసానాలపై ఇంజినీర్లు, అధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్ర అవసరాల రీత్యా విద్యుత్ ఉత్పత్తి కీలకమైన నేపథ్యంలో రెండు ప్రాజెక్టులపై ఉన్న జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగించరాదన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిని మినహాయించి మిగతా ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ఇంజినీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.
మరోసారి పరిశీలించండి
దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్ స్పిల్ వే, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్లు, వరద కాల్వ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను బోర్డుకు అప్పగించే అంశాన్ని పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా ఔట్ లెట్ల మానవ వనరులు, ప్రాంగణాలు, ప్లాంటులు, యంత్రాలను కృష్ణా బోర్డుకు స్వాధీనం చేసేందుకు వీలుగా సిబ్బంది వివరాలను మరోమారు పరిశీలించాలని నాగర్ కర్నూల్, నల్గొండ చీఫ్ ఇంజినీర్లను కూడా కోరినట్లు తెలిసింది.