తెలంగాణ

telangana

ETV Bharat / state

CPS: ఏపీలో కాంట్రిబ్యూటరీ లొల్లి.. దద్దరిల్లిన వీధులు..హోరెత్తిన కలెక్టరేట్లు - ఉద్యోగుల నిరసన

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. పాత పింఛను విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించారు. సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి జగన్‌ మాట తప్పారని ధ్వజమెత్తారు.

CPS
సీపీఎస్‌ రద్దు

By

Published : Sep 2, 2021, 9:51 AM IST

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండుతో ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. పాత పింఛను విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించారు. సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి జగన్‌ మాట తప్పారని ధ్వజమెత్తారు. పింఛను భిక్ష కాదు- ఉద్యోగుల హక్కని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి.. రెండేళ్లయినా నిర్ణయం తీసుకోలేదని, కమిటీలతో కాలయాపన చేయబోమని చెప్పి.. అనేక కమిటీలు వేశారని మండిపడ్డారు. పాత విధానం అమల్లోకి తెచ్చేవరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేయాలంటూ.. ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో ‘పెన్షన్‌ విద్రోహదినం- నయవంచన’ పేరుతో జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేసింది. ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్‌యూఎస్‌)- ఫ్యాప్టో సంయుక్తంగా ‘మహా నిరసన ర్యాలీలు- బహిరంగ సభ’లు నిర్వహించాయి.

నిరసనలకు ఏపీఎన్జీవో సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ), జాక్టో, పీఆర్‌టీయూ, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నేతలు మద్దతు పలికారు. విజయవాడ జింఖానా మైదానంలో నిర్వహించిన సభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు సూర్యనారాయణ, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అనంతపురంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఒంగోలులో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆందోళనల్లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు పాలెల రామాంజనేయులు అనంతపురంలో, ప్రధాన కార్యదర్శి బాజీపఠాన్‌ ఒంగోలులో, ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు మరియదాస్‌ మచిలీపట్నంలో నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

కడప బిడ్డ.. హామీ నిలబెట్టుకోవాలి

  • కడపలో సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ ఉద్యోగుల పిల్లలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొని నినాదాలు చేశారు. జగన్‌ కడప ముద్దుబిడ్డ అని.. రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉద్యోగులు డిమాండు చేశారు. ధర్నాలో ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ వెంకట జనార్దన్‌రెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు.
  • చిత్తూరులో ఫ్యాప్టో- ఏపీసీపీఎస్‌యూఎస్‌ నేతలు గాంధీవిగ్రహం కూడలిలో గాంధీ, ఫులే విగ్రహాలకు పూలమాలలు వేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసుల అభ్యంతరాన్ని సైతం కాదని వైఎస్‌ విగ్రహం చుట్టూ మానవహారంగా నిలబడ్డారు.
  • మచిలీపట్నంలో బస్టాండు నుంచి కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వరకూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. అనంతరం సభలో తెదేపా నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
  • విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఏపీసీపీఎస్‌ఈఏ, ఫ్యాప్టో వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి.
  • ఒంగోలులో ఏపీసీపీఎస్‌యూఎస్‌- ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీవీఆర్‌ బాలుర పాఠశాల నుంచి కలెక్టరేట్‌ వరకూ నిరసన ర్యాలీ అనంతరం ఆందోళన నిర్వహించారు.
  • పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు బైఠాయించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
  • నెల్లూరులో ఆత్మకూరు బస్టాండు నుంచి కలెక్టరేట్‌ వరకూ మహా బైక్‌ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ఏపీసీపీఎస్‌ఈఏ, ఫ్యాప్టో వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి.
  • కర్నూలులో కలెక్టరేట్‌ దగ్గర జరిగిన ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయం నుంచి ఎస్‌టీబీసీ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. తోపులాట

  • శ్రీకాకుళంలో ఉద్యోగుల ర్యాలీ అనంతరం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఏపీసీపీఎస్‌యూఎస్‌- ఫ్యాప్టోలు స్థానిక ఎన్జీవో హోం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ చేశాయి. నేతలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వాదోపవాదాలతో పరిస్థితి వేడెక్కి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తర్వాత ఉద్యోగులు శాంతించి స్థానిక డచ్‌ బిల్డింగ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
  • గుంటూరులో వర్షంలో తడుస్తూనే ఉద్యోగులు ర్యాలీ కొనసాగించారు. ఫ్యాప్టో- సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేంకటేశ్వర విజ్ఞానమందిరం దగ్గర ర్యాలీ ప్రారంభించారు. కలెక్టరేట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు వెనుదిరిగి ఎన్జీవో సంఘం హాలు వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడే సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్‌ సుధీర్‌బాబు పాల్గొన్నారు. సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బస్టాండు నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించి, పాత రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు పాల్గొన్నారు.
  • విజయనగరంలో ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి కణపాకలోని యువజన వసతిగృహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాఫ్టో- ఏపీసీపీఎస్‌యూఎస్‌ ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆందోళనల్లో పాల్గొన్నారు.
  • అనంతపురంలో ఫ్యాఫ్టో- ఏపీసీపీఎస్‌యూఎస్‌ ఆధ్వర్యంలో పాత ఆర్డీవో కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకూ మహార్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. సీపీఎస్‌ రద్దుపై ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ 109 సార్లు హామీ ఇచ్చారని, ఆయన మాటను ఉద్యోగులు నమ్మి బాసటగా నిలిచారన్నారు.

ఇదీ చదవండి:నానాటికి విస్తరిస్తున్న డ్రగ్​ దందా- హెరాయిన్​ హబ్​గా హైదరాబాద్​!

ABOUT THE AUTHOR

...view details