Election Commission Officials Visit To Telangana :శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడడంతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఊపందుకొంది. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం (Election Commission) కూడా ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేసింది. గతంలోనే ఒకమారు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఇవాళ మరోసారి పర్యటించింది. ఓటర్ల జాబితా (Votor List), ఈవీఎంల సన్నద్ధం, అధికారులకు శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది. రానున్న వారం, పది రోజుల్లోపు ఎన్నికల ప్రకటన (Election Schedule) వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ బృందం 3 రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటిస్తోంది.
ఇవాళ కేంద్రఎన్నికల కమిషన్‌ప్రతినిధులు (EC Officials MEEt With Political Party Leaders) రాజకీయ పార్టీల నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై అభిప్రాయాలను సేకరించారు.
BRS Leaders Meet With EC Officials : బీఆర్‌ఎస్ తరపున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల గుర్తుల విషయంలో తమకున్న అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆటో, ట్రక్కు, రోడ్డురోలర్ గుర్తుల వల్ల కారు గుర్తుకు కలుగుతున్న నష్టాన్ని వివరించామని ఈ గుర్తుకు సంబంధించిన తమ పిటిషన్‌ను రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు తెలుగులోకి కూడా అనువదించాలని కోరినట్లు తెలిపారు.
Congress Leaders Meet With EC Officials : దరఖాస్తులు అన్నీ పరిష్కరించే వరకు రేపు ఓటర్ల తుది జాబితా ప్రకటించవద్దని కోరామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఈసీ ప్రతినిధులతో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సమావేశమైన వీరు రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఓటర్లకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఓటరు జాబితా ప్రకటించవద్దని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
"కొన్ని నియోజకవర్గాల్లో బోగస్ ఓట్ల గురించి వారితో మాట్లాడాము. తెలంగాణలో ఫ్రీ ఫైర్ ఎన్నికలు జరపాలంటే మద్యం, డబ్బుల డిస్ట్రిబ్యూషన్ అపాలని తెలిపాము. వాటిని వీలైనంత వరకు వాటిని అపడానికి ప్రయత్నించాలని కోరాము. గతంలో డబ్బుల పంపకంపై వచ్చిన ఆరోపణలను వారి దృష్టికి తీసుకెళ్లాము." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
BJP Leaders Meet With EC Officials : రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపాలని... ఎక్కువ మంది పరిశీలకులను నియమించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులను కూడా నియమించాలని తెలిపారు. ఈసీ ప్రతినిధులతో ప్రధానంగా ఓటర్ల జాబితాలో లోపాల గురించి వివరించినట్లు ఓం పాఠక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.