నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (తెరాస) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా.. ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్‌పూర్‌ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఎన్‌హెచ్ 33 నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో 2011లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం మధుకాన్ సంస్థ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసింది. దీనికి సీఎండీగా కె.శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వీతేజలు ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1655 కోట్లు కాగా.. యాజమాన్యం వాటా రూ.503 కోట్లు. రహదారి నిర్మాణం కోసం 15 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి మొత్తం రూ.1029.39 కోట్ల రుణం విడుదల చేశాయి. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తొలుత రాంచీ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఒ) మొత్తం రూ.264 కోట్ల నిధుల మళ్లింపు జరిగినట్లు తేల్చింది. రుణం మంజూరు చేసిన బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019 మార్చిలో దిల్లీ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎంపీ నామాకు చెందిన మధుకాన్ సంస్థ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
తెరాస లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై మనీలాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసు నమోదు చేసింది. శుక్రవారం ఉదయం నుంచి నామాతో పాటు రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిడెట్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ టోల్ హైవే సంస్థలతోపాటు ఆడిటర్లు తదితరులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. దర్యాప్తు పూర్తిచేసి 2020లోనే న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలుచేసింది. ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరిగినట్లు అందులో పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణం ఇతరత్రా ఖాతాల్లోకి మళ్లించారన్న సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని మధుకాన్ ఇన్ఫ్రా కార్యాలయంతోపాటు జుబ్లీహిల్స్, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు కలిపి మొత్తం ఏడు చోట్ల సోదాలు జరిగాయి. ఈడీ అధికారులు పలు హార్డ్‌డిస్కులు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: Mlc Kavitha: 'తెరాసతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి'