EC Suspended Telangana Tourism MD Manohar Rao : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఈసీ పలు సూచనలు చేసింది. తనిఖీలు, ప్రలోభాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana Tourism MD Manohar Rao Suspended :తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌రావుపై (Telangana Tourism MD Manohar Rao) సస్పెన్షన్ వేటు పడింది. ఎండీకి ఓఎస్డీగా పనిచేస్తున్న విశ్రాంత అధికారి సత్యనారాయణపై కూడా చర్యలు తీసుకున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అక్టోబర్ 15, 16 తేదీల్లో తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు, ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న సత్యనారాయణ కూడా తిరుమలలో కనిపించారు.
ఇరువురిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.. సీఈసీకి నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా.. ఇద్దరు అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఇద్దరు అధికారుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19న మధ్యాహ్నం మూడు గంటల్లోపు నివేదించాలని స్పష్టం చేసింది.
Telangana Tourism OSD Sacked : అంతే కాకుండా పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న మనోహర్‌రావుపై .. ఎంసీసీ నిబంధనల ఉల్లంఘన కింద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్‌కు లేఖ రాసింది. సీఈసీ లేఖ అందుకున్న వికాస్ రాజ్ మనోహర్ రావును సస్పెండ్ చేయడంతోపాటు ఆయన ఓఎస్డీగా పని చేస్తున్న సత్యనారాయణను విధుల నుంచి తప్పించారు.