EC Precautions on Telangana Elections :శాసనసభ ఎన్నికల సమరం(TS Elections) కీలక అంకానికి చేరింది. నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. నేటితో ఉపసంహరణల గడువు ముగియనుంది. ఉపసంహరణల గడువు ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి బ్యాలెట్ పత్రాన్ని ఖరారు చేస్తారు. దీంతో ఇక ఎన్నికల సమరం తదుపరి ప్రక్రియ ఊపందుకోనుంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా తలపడనున్నారు. అధికారులు ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ
గత అనుభవాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఈ మారు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రతి దశ, ప్రతి ప్రక్రియను నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఈసీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి ప్రక్రియలోనూ రాష్ట్ర అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ఏ చిన్న పాటి ఫిర్యాదు వచ్చినా, ప్రతికూల సమాచారం వచ్చినా, విషయం తెలిసినా వెంటనే క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అడుగుతున్నారు.
Central Election Commission Review on TS Elections :నివేదికలు, వివరణలు నిర్ధిష్ట గడువులోగా అందేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆ నివేదికలు, ఇచ్చిన వివరణలు, వాటిపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయి కొన్ని సందర్భాల్లో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా వరకు పార్టీలు, అభ్యర్థులు తమ ఫిర్యాదులను వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా ఈసీకి కూడా పంపుతున్నారు. దీంతో వాటిపై నిర్ధిష్ట గడువులోగా స్పందించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోంది.