ఎంసెట్ వెబ్ ఆప్షన్ల గడువు ముంచుకొస్తున్న వేళ.. జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల గుర్తింపు(అఫిలియేషన్) ప్రక్రియ పూర్తి కాకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనెల 3 రాత్రిలోగా పూర్తి కాకపోతే సీట్లు ఎంచుకునేందుకు వీలుండదు. జేఎన్‌టీయూ పరిధిలో 148 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఏటా ఎంసెట్ కౌన్సెలింగ్ కంటే ముందుగా ఆయా కళాశాలల తనిఖీలు పూర్తిచేసి గుర్తింపునివ్వాలి. ఆ జాబితాను ఉన్నత విద్యామండలికి సమర్పిస్తే.. ఎంసెట్ ర్యాంకులు దక్కించుకున్న విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు వీలవుతుంది. కరోనా ఉద్ధృతి కారణంగా గతేడాది తనిఖీలు లేకుండానే జేఎన్‌టీయూ గుర్తింపునిచ్చింది.
తనిఖీలు పూర్తి.. నివేదికల పరిశీలన...
ఈ ఏడాది తనిఖీలు పూర్తి చేశాకే గుర్తింపునివ్వాలని ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి అనూహ్యంగా ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. హుటాహుటిన జేఎన్‌టీయూ స్పందించి గత నెల 23 నుంచి కళాశాలల తనిఖీ చేపట్టి 30వ తేదీకి పూర్తి చేసింది. ప్రస్తుతం నివేదికలు పరిశీలించి గుర్తింపు ఇచ్చే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు 7 నుంచి 10 రోజులు పట్టొచ్చు.