జంట నగరాల పరిధిలో దాదాపు 5 వేలకుపైగా కుటుంబాలు విగ్రహాల తయారీ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. వీరికితోడు సీజన్‌కి 7 నెలల ముందు జనవరిలో కోల్‌కతా, ముంబయి, యూపీ నుంచి వేల మంది కళాకారులు వస్తుంటారు. వినాయక ఉత్సవాల కోసం కనీసం లక్షకుపైగా గణేశ్ ప్రతిమలు, దసరాకు ముందు 60 వేల దాకా దుర్గామాత ప్రతిమలు తయారు చేస్తుంటారు. అయితే గత ఏడాదిన్నరగా రెండు సీజన్లూ ఈ కుటుంబాలకు కలిసి రాకపోగా విగ్రహాలన్నీ షెడ్లకే పరిమితమై పాడైపోయాయి. ఈ ఏడాది 70 వేల భారీ గణేశ్ విగ్రహాలు అమ్ముడుకాగా 50 వేల దాకా దుర్గామాత ప్రతిమలు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివెళ్లాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెట్టిన ఖర్చుతోపాటు నష్టం నుంచీ తేరుకునే అవకాశం దక్కిందని సంబరపడుతున్నారు
151 చేస్తే అన్నీ అయిపోయాయి
ఏటా వందల్లో విగ్రహాలు చేసి పెడుతుంటాం. కానీ 2 దఫాలు వినాయక ప్రతిమలు, దుర్గామాత ప్రతిమలు సగం కూడా అమ్ముడు పోలేదు. సెప్టెంబరు, అక్టోబరులో జరిగే పండగల కోసం జనవరి నుంచే తయారీ మొదలుపెడతాం. దాదాపు 20 మంది కార్మికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తారు. వారందరికీ ఖర్చులూ కష్టమయ్యేవి. ఈ ఏడాది 151 విగ్రహాలూ అమ్ముడుపోయాయి.
- లక్ష్మీనారాయణ విగ్రహాల తయారీదారు, ధూల్‌పేట