ఆరుగాలం శ్రమించే రైతులకు పంటల బీమా ఇక నుంచి ధీమా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంట బీమా చేయించడాన్ని స్వచ్ఛందం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానమంత్రి పంట బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద రైతులు పంటలకు బీమా చేయిస్తున్నారు.
బీమా చేయించినా పరిహారం లేదు
2019-20 ఆర్థిక సంవత్సరం వరకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే ప్రతి రైతు... కచ్చితంగా బీమా ప్రీమియం చెల్లించాలి. ఐతే బీమా చేయించినా పరిహారం రావడం లేదని అన్నదాతలు అనాసక్తి చూపిస్తున్నారు. కచ్చితంగా ప్రీమియం తీసుకోవాలనే నిబంధన ఉన్నా... 13.5 శాతం మంది రైతులే గత ఖరీఫ్‌లో బీమా చేయించారు.
రాష్ట్రంలో మొత్తం 59 లక్షల మంది రైతులు ఉంటే... 8 లక్షల మందే ప్రీమియం కట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 50 శాతం పంటల విస్తీర్ణం... బీమా పరిధిలోకి రావాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో కనీసం 4వ వంతు పంటకైనా బీమా చేయించలేదు.