రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొస్తాయో కానీ.. శిక్షణ కోసం ఉద్యోగార్థుల ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. కరోనాకు ముందుతో పోల్చితే ప్రైవేటు శిక్షణ సంస్థలు, వసతి గృహాల ఫీజులు దాదాపు రెట్టింపయ్యాయి.పేరున్న శిక్షణ సంస్థల్లో గ్రూప్-1 కోచింగ్‌కు రూ.60 వేలు-లక్ష చెల్లించాల్సి వస్తోంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో గ్రూప్-1, 2, 3, 4 శిక్షణ కోసం గ్రామాల నుంచి యువత హైదరాబాద్‌కు వస్తున్నారు. కరోనాతో ఓవైపు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అప్పులు చేసి కొలువుల ఆశతో శిక్షణ కేంద్రాల వైపు వెళ్తున్నారు. గ్రూప్-1 శిక్షణ, వసతి, పుస్తకాలు తదితర వాటి కోసం సగటున ఒక్కో అభ్యర్థి ఏడాదికి రూ.2.50-3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఈ ఖర్చు రెండింతలవుతోంది. వీటిని భరించలేని కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఇంటికి వెళ్లిపోతున్నారు.
కరోనాకు ముందు గ్రూప్-1, 2 ఫీజులు తక్కువగా ఉండేవి. మధ్య స్థాయి శిక్షణ సంస్థలు గ్రూప్-1కు రూ.35 వేలు, గ్రూప్-2కు రూ.15 వేల వరకు తీసుకునేవి. ప్రస్తుతం గ్రూప్-2కు రూ.25 వేల వరకు తీసుకుంటున్నాయి. కరోనాకు ముందు నెలకు రూ.4-5 వేలు ఉండే మెస్ ఛార్జీలు.. రూ.8-12 వేలయ్యాయి. ఉదాహరణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్ష కోసం శిక్షణ సంస్థల్లో మూడేళ్ల క్రితం రూ.16 వేల ఫీజు ఉండేది. ఇటీవల రూ.25-40 వేలకు పెరిగిందని ఆ పరీక్షకు శిక్షణ పొందిన అభ్యర్థి రాజు వెల్లడించారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీరూమ్ పేరిట నెలకు రూ.1,500-2,000 వసూలు చేసే సంస్థలూ వెలిశాయి. మహమ్మారితో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టడం లేదు. ఇదే సమయంలో ప్రత్యక్ష తరగతుల కన్నా, ఆన్‌లైన్ కోచింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మేరకు శిక్షణ సంస్థలు ప్రత్యేక యాప్‌లు రూపొందించాయి. ఫీజులూ భారీగానే ఉంటున్నాయి. గ్రూప్-1 కోసం కొన్ని సంస్థలు రూ.50 వేలు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్ పాఠాలతో పాటు స్టడీమెటీరియల్ ఇస్తామని చెబుతున్నాయి. గ్రూప్-2 కోసం రూ.5-8 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజుల్లో ఎలాంటి రాయితీలివ్వడం లేదు.
ప్రత్యామ్నాయాల వైపు చూపు..