Double Bedroom Houses Distribution in Hyderabad Today :రెండో విడతలో ఎంపికైన లబ్దిదారులకు ఇవాళ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు.
2BHK Second Phase Distribution Today :అందులో భాగంగా మొదటి విడతలో ఎన్ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్లైన్ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేశారు. రెండో విడతలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక కోసం.. ఈ నెల 15 వ తేదీన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్లైన్ డ్రా నిర్వహించి 13,300 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు.
డ్రా లో ఎంపికైన లబ్దిదారులకు ఇవాళ 9 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR)2100 మంది లబ్దిదారులకు మధ్యాహ్నం 12 గంటలకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్సాన్పల్లిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 700 మంది లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను ఇవ్వనున్నారు.
2BHK Distribution in Hyderabad :ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అట్టిగూడలో భూగర్బ గనులశాఖ మంత్రి మహేందర్ రెడ్డి 432 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తట్టి అన్నారంలో హోంమంత్రి మహమూద్ అలీ 1268 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ లోని తిమ్మాయిగూడ లో 600 ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొననున్నారు.