- లాక్‌డౌన్‌లో.. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక.. ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను చూసి చలించిపోయిన ఓ జంట రోజూ వంద మందికి అన్నదానం చేస్తోంది.. ఇంతకీ ఆ భార్యాభర్తల బతుకుతెరువు ఓ జ్యూస్ స్టాల్!
- ఆకలి బాధను అర్థం చేసుకున్న ఆమె తన స్వహస్తాలతో వండి, పొట్లాలు కట్టి తన భర్తతో కలిసి వెళ్లి నిరుపేదలకు ఇచ్చివస్తోంది.. ఇది ఓ న్యాయమూర్తి దాతృత్వం!
- ఆసుపత్రిలో అందరికీ బెడ్‌లు అందించేందుకు ముగ్గురు యువకులు 10 బెడ్ ఐసీయూ పేరుతో బృహద్ యజ్ఞమే చేస్తున్నారు. వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు మరో ముగ్గురు యువకులు అనుసరిస్తున్న మార్గం అందరితో శెభాష్ అనిపించుకుంది.
ఐసీయూ బెడ్‌లు.. అందుబాటులోకి!
ఆసుపత్రిలో బెడ్ దొరక్క కళ్లముందే ప్రాణాలు విలవిల్లాడుతుంటే నిస్సహాయంగా చూస్తుండి పోవాల్సిందేనా? ఈ సమస్యకు పరిష్కారం లేదా?
దాన్ని కనుక్కోడానికి ప్రయత్నం చేశారు ఈ యువకులు. విదేశాల్లో ఉన్నతోద్యోగం చేసి తిరిగొచ్చిన నగేశ్‌రెడ్డి గౌరవరం, రాజు పాకాల, ఈ-గవర్నమెంట్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, ఆధార్ సీటీవోగా ఉన్న శ్రీకాంత్ నాదముని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్‌లను సమకూర్చాలని అనుకున్నారు. కానీ నిధులెలా? దాన్ని సాకారం చేసే దారేది? దానికోసం ‘10 బెడ్ ఐసీయూ’ అన్న ప్రాజెక్టుకు నాంది పలికారు. గ్రామాల్లో వైద్యసేవల పరిస్థితి, ఐసీయూ బెడ్‌ల ఆవశ్యకతను డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రచారం చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలో కొవిడ్ బాధితులకు సేవలందించాలన్న సంకల్పంతో ఉన్న సన్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్‌ఖోస్లా ఈ ప్రాజెక్టుకు తన మద్దతు ప్రకటించారు. నిధులందించేందుకు ముందుకొచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, వివేకానంద గిరిజన కల్యాణ కేంద్రం వ్యవస్థాపకుడు డాక్టర్ సుదర్శన్ హనుమప్ప వంటి ప్రముఖులు కూడా తోడయ్యారు. దీంతో ‘10బెడ్ ఐసీయూ’ సాకారమైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో 33 చోట్ల 10 బెడ్ ఐసీయూలను నెలకొల్పబోతున్నారు. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చుచేయనున్నారు. ఇందులో 10 ఐసీయూ బెడ్‌లతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇన్ఫ్యూజన్ పంప్‌ల ఉంటాయి. ఈ ప్రాజెక్టు అమలు, నిధులు, పరికరాల సేకరణ బాధ్యతను నిర్మాణ్ ఫౌండేషన్ చేపడుతోంది. ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, పర్యవేక్షణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు తీసుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
చిన్న వయసు... పెద్ద మనసు..
జ్యూస్ పాయింట్ నడిపే యువజంట లాక్‌డౌన్ సమయంలో రోజుకు వంద మంది పేదలు, అభాగ్యుల కడుపు నింపుతున్నారు. ఖమ్మం పటేల్ స్టేడియం ఎదుట రోడ్డులో భయ్యా భరత్‌యాదవ్, సరిత దంపతులు జ్యూస్ పాయింట్ నడుపుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి రోడ్డు పక్కన నివసించే ఎంతోమంది ఆకలితో అలమటించిపోవడం వీరిని చలింపజేసింది. ఎంతోమంది ఆకలవుతోంది.. అన్నం పెట్టండి అని అర్థించడం వారిని ఆవేదనకు గురిచేసింది. తమకు చేతనైనంత మందికి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్న ఈ దంపతులు వారం రోజులుగా రోజూ ఇంట్లోనే ఆహారం వండి, పొట్లాలు కట్టి స్వయంగా తీసుకెళ్లి అన్నార్తులకు పంపిణీ చేస్తున్నారు. రోజూ వంద మందికి భోజనాలు తయారు చేసేందుకు రూ.4 వేల వరకు ఖర్చవుతోందని, కొంతమంది స్నేహితులు సాయం చేస్తున్నారని చెబుతున్నారా దంపతులు. లాక్‌డౌన్ మొత్తం ఇలాగే కొనసాగించాలనుకుంటున్నామని అంటున్నారు వారు. వారి సేవలకు కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరుగు యువకులూ సహకరిస్తున్నారు.
అభాగ్యుల సేవలో న్యాయమూర్తి!
ఆకలితో అలమటిస్తున్న పేదవారి కడుపు నింపడం కన్నా మంచి తీర్పు ఏముందని అంటారు ఆ న్యాయమూర్తి. అందుకే ఆమె రోజూ వందమంది నిరుపేదలకు స్వయంగా వండివడ్డించి మానవత్వాన్ని చాటుతున్నారు. చేవెళ్ల మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి స్వాతి మురారి వలస కూలీలు, ప్రయాణికుల కోసం రెండు రోజులుగా చేవెళ్లలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. రోజూ వంద మందికి సరిపడేలా స్వయంగా వండి, దాన్ని ప్యాక్ చేసి తన భర్త అమిత్‌కుమార్‌తో కలిసి పేదలకు అందిస్తున్నారు. ఆమె గతేడాది లాక్‌డౌన్ కాలంలోనూ దాదాపు నెల రోజుల పాటు రోజూ వంద మందికి అన్నం పెట్టేవారు. హోటళ్లు మూతపడటంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్న వారు ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారని, ఉపాధి కోసం ఎక్కడి నుంచో వచ్చిన కూలీలు కడుపు నిండక ఇబ్బందులు పడుతున్నారని.. వారిలో కొందరి ఆకలినైనా తీర్చాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అంటారామె.