హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉందీ కేఫే ద లోకో కుక్కల రెస్టారెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెట్టమెదటి కుక్కుల రెస్టారెంట్. అక్కడకు వెళ్లగానే ఏదైనా పల్లెటూరుకి వెళ్లామా అన్న భావన కలుగుతుంది. రెస్టారెంట్ చుట్టూ పచ్చని మొక్కలు, మధ్యలో మైదానం, పల్లెల్లో ఉండే గుడిసెలు మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. గేటు తీయగానే అక్కడ ఉండే కుక్కలు ప్రేమగా వచ్చి వాసన చూస్తాయి. మన వెంట తీసుకెళ్లే కుక్కలను కూడా స్నేహంగా వాటితో కలుపుకుంటాయి. వాటికి నచ్చిన ఆహారం తింటూ... మంచాలపై పడుకొని సేద తీరుతూ... ఆడుకుంటాయి. అక్కడున్న కుక్కలు అలా స్నేహంగా మెలగటానికి కారణం రెస్టారెంట్ నిర్వాహకులే.
రుచిరా సకర్వాల్, హేమంత్ సకర్వాల్ దంపతులు రెండేళ్లక్రితం సినీ నటి అమల చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రుచిరా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పటికీ... కుక్కల మీద ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్‌లో రోడ్ల మీద తిరిగే కుక్కలను తీసుకెళ్లి పెంచుతున్నారు. వాటికి రోజూ ఆహారాన్నందిస్తూ దత్తత తీసుకోవాలనుకునే వాళ్లకు ఈ కుక్కలను అందిస్తుంటారు. నెలకోసారి వైద్యుల్ని రప్పించి తాము పెంచుతున్న కుక్కల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ 80 కుక్కలున్నాయని అవన్నీ దేశీయ జాతులకు చెందినవేనని రెస్టారెంట్ నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు.