Dog Attacks Increased in Telangana : రాష్ట్రంలో కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇటీవల కాలంలో మరీ ఎక్కువైన శునకాల దాడులతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ వైపుగా ఏ కుక్క దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుంటున్నారు. దాదాపు 2 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉంటున్న వీధి శునకాలు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి.
ఈ కుక్కల దాడిలో హైదరాబాద్‌లో ఇటీవల ఓ బాలుడు ప్రాణాలు సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి.. కుక్కల బెడదను కాస్త తగ్గించినా.. పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కుక్క కాటుకు బలవుతున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా కుత్బుల్లాపూర్‌లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. సూరారం కాలనీలో ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.
సూరారంలోని రాజీవ్ గృహకల్పకు చెందిన ప్రేమ్ అనే బాలుడిపై దాడి చేసిన శునకాలు.. తీవ్రంగా గాయపరిచాయి. గాజుల రామారాంలోని చెన్న కేశవ కాలనీలోనూ ఓ బాలికపై దాడి చేశాయి. అన్విత అనే బాలిక గురువారం ఉదయం కిరాణా దుకాణానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కలు మీదపడి శరీరం మొత్తం గాయాలు చేశాయి. దీంతో అన్విత తల్లిదండ్రులు వెంటనే షాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా వీధి కుక్కలపై సరైన చర్యలు తీసుకోవడంలో మున్సిపాలిటీ అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా కుక్కలు దాడి చేస్తుండటంతో భయం భయంగా కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.