తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Alert: జ్వరం.. జలుబు.. దగ్గు.. లక్షణాలు ఉన్నాయా? అయితే నిర్లక్ష్యం వద్దు! - Doctors advise not to neglect

జలుబు.. జ్వరం.. దగ్గు.. (fever, cold, cough) లాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే నిర్లక్ష్యం మాత్రం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా (corona) పూర్తిగా తగ్గని దృష్ట్యా లక్షణాలు కన్పిస్తే... పరీక్షలు చేయించడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. కరోనా అని తేలితే అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

Doctors advise not to neglect if you have symptoms like fever, cold, cough
Corona Alert: జ్వరం.. జలుబు.. దగ్గు.. లక్షణాలు ఉన్నాయా? అయితే నిర్లక్ష్యం వద్దు!

By

Published : Nov 12, 2021, 10:32 AM IST

పిల్లల్లో కనిపించే జలుబు.. జ్వరం.. దగ్గు.. (fever, cold, cough)లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా (corona)పూర్తిగా తగ్గని దృష్ట్యా లక్షణాలు కన్పిస్తే... పరీక్షలు చేయించడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. కరోనా అని తేలితే అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరోనా అనంతరం కొంతమంది పిల్లల్లో మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌) ముప్పు ఉంటుంది.

కొన్ని నెలలుగా 15 మంది పిల్లలు వరకు ఈ సమస్యతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. అందరూ 4-12 ఏళ్లలోపు వారే. వీరిలో చాలామందికి కరోనా సోకినట్లు వారి తల్లిదండ్రులకే తెలియకపోవడం చూసి వైద్యులే విస్మయం వ్యక్తం చేశారు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం, మరికొందరిలో సాధారణ జలుబు, దగ్గు ఉన్నా 2-3 రోజుల్లో తగ్గిపోవడంతో తల్లిదండ్రులు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం 2-3 నెలల తర్వాత పిల్లల్లో కొత్త ఇబ్బందులు తలెత్తాయి. తీవ్రమైన జ్వరం, విరేచనాలు, కడుపులో నొప్పి, కాళ్లలో నీళ్లు చేరటం, చేతుల నుంచి పొట్టులా రాలటం, నాలుక గులాబి రంగులోకి మారటం లాంటి లక్షణాలతో గాంధీలో చేరారు. వీరందరికి కరోనా అనంతరం ఎంఐఎస్‌ సోకినట్లు తేలింది. తమ పిల్లలకు కరోనా సోకినట్లు తమకు తెలియదని తల్లిదండ్రులు వాపోయారు. గాంధీలో చికిత్సలు అనంతరం కోలుకున్నారు. జలుబు, దగ్గు, జ్వరం సాధారణమే అనుకోవద్దని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎంఐఎస్‌ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా..

చలి కాలంలో పెద్దలు సైతం వైరల్‌ జ్వరాల బారిన పడుతుంటారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వైరల్‌ జ్వరాలు 3-5 రోజుల్లో తగ్గుతాయి. కరోనా కాలంలో ఇలాంటి లక్షణాలను పిల్లలే కాదు పెద్దలు సైతం నిర్లక్ష్యం చేసేందుకు వీల్లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర రోగాలుంటే అప్రమత్తంగా ఉండాలని సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ శివరాజ్‌ సూచించారు. గతంలో ఓ వ్యక్తికి కరోనా వచ్చి తగ్గింది. ఆయన అప్పటికే రెండు డోసుల టీకాలు తీసుకున్నాడు. ఇటీవల జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కన్పించాయి. అప్పటికే ఆయనకు బీపీ, షుగర్‌ వ్యాధులున్నాయి. సాధారణమే కదా అని కరోనా పరీక్షలు చేయించుకోలేదు. అయిదు రోజులకు ఆయాసం పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఐసీయూలో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందించారు. నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్‌ అందించగా కొన్ని రోజులకు కోలుకున్నాడు.

పరీక్షలను నిర్లక్ష్యం చేయొద్దు

గతంలో కరోనా వైరస్‌ సోకి కోలుకున్న వారితోపాటు టీకా తీసుకున్న వారిలో తాజాగా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి సోకుతుంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కరోనా టెస్టులు చేయించుకోవడం లేదు. కొందరిలో మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. 3-4 రోజుల్లో లక్షణాలు తగ్గిపోతున్నాయి. మరికొందరిలో మాత్రం ఆరోగ్యం విషమంగా మారే ప్రమాదం ఉందని డాక్టర్‌ శివరాజ్‌ తెలిపారు. పరీక్షలు చేయించుకోకుండా... అటుఇటు తిరగడం వల్ల వారి ద్వారా ఇంకొందరికి కరోనా సోకే అవకాశం ఉంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వచ్చి తగ్గినా... టీకా తీసుకున్నా... గరిష్ఠంగా ఏడాది వరకు శరీరానికి రక్షణ ఉంటుంది. కొందరిలో వ్యాధి నిరోధకత తగ్గిన వెంటనే మరోసారి కరోనా దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఇంకా టీకాలు అందుబాటులోకి రాలేదు. పాఠశాలలు తెరుచుకున్న దృష్ట్యా పిల్లలకు కరోనా ముప్పు ఉన్నట్లే. ఈ క్రమంలో పిల్లల్లో కరోనా లక్షణాలు కన్పిస్తే... వెంటనే పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:jal shakti Gazette: 'జల్​శక్తి గెజిట్​ అమలు వేగవంతమయ్యేలా చూడండి

ABOUT THE AUTHOR

...view details