dk aruna comments on kcr : పేదల ఇళ్ల కోసం 2012లో గద్వాలలో సేకరించిన 78 ఎకరాల భూమిని ముట్టుకుంటే ఉసురు కొట్టుకుపోతారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే.అరుణ మండిపడ్డారు. నర్సింగ్ కాలేజ్ పేరుతో బలహీన వర్గాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎకరం భూమి సేకరించే దమ్ములేదని ఎద్దేవా చేశారు. మంత్రి హారీశ్ రావు ఏ ముఖం పెట్టుకుని... పేదలో భూమిలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ప్రశ్నించారు.
పేదలందరికీ రెండు పడక గదులు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తెరాస సర్కారు.. ఇళ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. బలహీన వర్గాల కోసం సేకరించిన 78వేల ఎకరాల్లో 10వేల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. గద్వాలలో 5 వేల మందికి ఇళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వలేదని లక్ష్మీనరసింహాస్వామిపై ప్రమాణం చేయగలరా అని అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
'తెరాస ఎన్నికల హామీగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని చెప్పింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి నాలుగున్నరేళ్లు సరిపోలేదు మరో అవకాశం ఇవ్వండి ఇళ్లు నిర్మిస్తామన్నారు. నేను మంత్రిగా చేసిన సమయంలో 2012లో 78ఎకరాల పట్టా భూమిని బలహీన వర్గాల ప్రజల ఇళ్ల కోసం సేకరించి.. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశాం. ఆ 78 ఎకరాల భూమిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ కేవలం 500 ఇళ్లు మాత్రమే నిర్మించారు. కానీ వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇప్పుడేమో గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లవని చెబుతున్నారు. నర్సింగ్ కాలేజీ, ఆస్పత్రి పేరుతో బలహీన వర్గాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎకరం భూమి సేకరించే దమ్ము లేదా..? ఏ ముఖం పెట్టుకుని హరీశ్‌రావు పేదల భూమిలో నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేస్తున్న పని సక్రమమైంది అయినప్పుడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఎందుకు? 78వేల ఎకరాల్లో 10వేల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చుకదా.. గద్వాలలో 5వేల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తానని హామీ ఇవ్వలేదని.. కేసీఆర్ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పాలి. గద్వాలలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ ఈ స్థలమే ఎందుకు కావాల్సి వచ్చింది. రింగురోడ్డు పక్కన పేదలు ఇళ్లు కట్టుకోకూడదా కేసీఆర్.' -డీకే.అరుణ
ఇదీ చూడండి:Inter first year results: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫెయిలైనోళ్లంతా పాస్..