AP Cadre officers in Telangana : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్‌కి వెళ్లినా.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. తెలంగాణలోనే కొనసాగుతున్నారు. డీవోపీటీ ఆదేశాలపై అప్పట్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ - క్యాట్‌కి వెళ్లి స్టేతెచ్చుకొని తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. సోమేశ్ కుమార్ విషయమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఆ అధికారుల పరిస్థితి ఏమిటన్న అంశంపై చర్చ మొదలైంది.
సోమేశ్ కుమార్ కేసు విచారణ సమయంలో సదరుఅధికారుల అంశం ప్రస్తావనకు వచ్చింది. విచారణ సమయంలో వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందరు అధికారులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది. ప్రస్తుతం సోమేశ్ కుమార్ విషయంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను.. హైకోర్టు కొట్టివేయడం, ఆ వెంటనే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణా విభాగం ఆదేశాలు జారీచేయడం చకచకా జరిగిపోయాయి. తక్షణంఆయణ్ని రిలీవ్‌చేసిన డీవోపీటి.. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో చేరాలని స్పష్టంచేసింది.
రాష్ట్ర కేడర్‌లో కొనసాగుతున్న అధికారుల పరిస్థితి ఏమిటి?:సోమేశ్ కుమార్ తరహాలో క్యాట్‌స్టే ఆధారంగా.. రాష్ట్ర కేడర్‌లో కొనసాగుతున్న అధికారుల పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ అదే తరహాలో తెలంగాణలో కొనసాగుతున్నారు. మరో ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్.. ఏపీ కేడర్ అయినా తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణిప్రసాద్, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంతి, కేంద్రసర్వీసుల్లో ఉన్న అమ్రపాలి క్యాట్‌స్టే ఆధారంగానే.. తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారి విషయంలో డీవోపీటీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.