TALARI CHERUVU : ఆశ..! క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది అన్నాడో.. ఓ సినీ రచయిత. అదే రీతిలో అగ్గిపాడు అనే ఆచారం.. అరిష్టం నుంచి ఊరిని, ప్రజలను ఎన్నోఏళ్లుగా కాపాడుతోందంటున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఓ గ్రామ వాసులు. ఇంతకీ ఆ వింత ఆచారం ఏంటి..? వారిని వేధిస్తున్న సమస్య ఏంటో చూద్దాం రండి.
ఊరి బాగు, గ్రామస్తుల మేలు కోసం వింత నమ్మకాన్ని ఆచారంగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని తలారి చెరువు గ్రామస్తులు. మాఘ మాసం పౌర్ణమికి ముందు రోజున ఊరిలోని వారంతా పెంపుడు జంతువులతో సహా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతారు. అగ్గిపాడు అనే వింత ఆచారంలో భాగంగా ఊరిలోని అన్ని ఇళ్లల్లో అగ్గి, వెలుతురు లేకుండా దీపాలు ఆపేసి.. సమీపంలోని దర్గాకు చేరుకుంటారు. అలా పౌర్ణమి రోజంతా ఊరికి దూరంగా గడుపుతారు.
ఆ ఆచారం వెనుక ఓ కథ ఉంది. పూర్వం తలారిచెరువు గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడు దోచుకోవడంతో గ్రామస్తులంతా కలిసి ఆయనను హత్య చేశారు. నాటి నుంచి ఊరిలో పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోవడానికి.. బ్రాహ్మణుడిని హత్య చేయడమే కారణమని ఓ జ్యోతిష్యుడు తెలిపారు. పరిష్కార మార్గంగా మాఘచతుర్థశి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు అగ్గిపాడు ఆచారం పాటించాలని సూచించినట్లు గ్రామస్తులు వివరించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ సంప్రదాయం ఏటా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.