తెలంగాణ

telangana

ETV Bharat / state

బల్దియా పోరులో కారుకు కమలానికి తేడా 0.25 శాతం మాత్రమే - Ghmc election results

బల్దియా పోరులో అధికార పార్టీకి కమలదళం గట్టిపోటీనిచ్చింది. 55 డివిజన్లు గెల్చుకున్న తెరాస గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించగా.... అనూహ్యంగా పుంజుకున్న భాజపా 48 స్థానాల్లో విజయం సాధించింది. చాలా చోట్ల ఓట్లు, సీట్లలో కారుతో కమలం పోటీపడింది. గత ఎన్నికలతో పోల్చితే తెరాస, కాంగ్రెస్‌లు ఈ సారి తమ ఓటింగ్‌ శాతాన్ని కోల్పోగా... భాజపా రికార్డు స్థాయిలో, మజ్లిస్‌ స్వలంగా ఓట్లను పెంచుకున్నాయి.

బల్దియా పోరులో కారుకు కమలానికి తేడా 0.25 శాతం మాత్రమే
బల్దియా పోరులో కారుకు కమలానికి తేడా 0.25 శాతం మాత్రమే

By

Published : Dec 5, 2020, 5:15 AM IST

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. అధికార తెరాసకు పెద్దసంఖ్యలో సీట్లు తగ్గగా... భారతీయ జనతాపార్టీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మజ్లిస్, తన స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో మాదిగానే రెండు సీట్లతో సరిపెట్టుకొంది.

భాజపాకు భారీగా పెరిగిన ఓటింగ్...

ఓట్ల పరంగా చూస్తే ఎన్నికల్లో మొత్తం 33 లక్షలా 62 వేల 249 ఓట్లు చెల్లుబాటయ్యాయి. వీటిలో తెరాస 12 లక్షల 4వేల 167 ఓట్లను సాధించింది. భాజపాకు 11లక్షల 95వేల 711 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ కంటే కమలదళానికి 19వేల 233 ఓట్లు తక్కువగా వచ్చాయి. మజ్లిస్​కు 6లక్షల 30వేల 866 ఓట్లు రాగా... హస్తానికి 2లక్షల 24వేల 528 ఓట్లు దక్కాయి.

తెరాసకు తగ్గిన ఓట్లు...

2016 ఎన్నికల్లో తెరాస 14 లక్షల 68 వేల 618 ఓట్లు సాధించగా... ఈ సారి గతంలో కంటే 2 లక్షల 64 వేల 451 ఓట్లు తగ్గాయి. భాజపాకు గత ఎన్నికల్లో 3 లక్షల 46వేల 253 ఓట్లు రాగా... ఈ ఎన్నికల్లో మరో 8 లక్షల 49 వేల 458 ఓట్లు పెరిగాయి. మజ్లిస్‌కు గత ఎన్నికల్లో 5లక్షల 30వేల 812 ఓట్లు దక్కగా.... ఈసారి పెరుగుదల లక్షా 54 గా ఉంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 3 లక్షల 48వేల 388 ఓట్లు సాధించగా... ఈ ఎన్నికల్లో లక్షా 23వేల 860 ఓట్లు తక్కువగా వచ్చాయి.

తేడా 0.25 ఓట్ల శాతం మాత్రమే...

ఈ ఎన్నికల్లో తెరాసకు భాజపా కంటే 7స్థానాలు ఎక్కువగా రాగా... ఓట్ల వ్యత్యాసం 8వేల 456 మాత్రమే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య 0.25 ఓట్ల శాతం మాత్రమే తేడా కనిపించింది. 2016 ఎన్నికల్లో తెరాసకు 43.85 శాతం ఓట్లు రాగా... ఈ సారి 8.04 శాతం ఓట్లు తగ్గి.... 35.81 శాతంతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 10.34శాతం ఓట్లు రాగా... ఈసారి ఏకంగా 25.22శాతం పెరిగి మొత్తం 35.56 శాతం ఓట్లు సాధించింది.

మజ్లిస్‌ 2016లో 15.85 శాతం ఓట్లు సాధించగా.... ఇప్పుడు 2.91 శాతం పెరుగుదలతో 18.76శాతం ఓట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌కు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10.4 శాతం ఓట్లు రాగా... ఈ సారి 3.73 తగ్గుదలతో 6.67శాతం ఓట్లను మాత్రమే చేజిక్కించుకుంది.

  • ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు
పార్టీ ఓట్లు శాతం
తెరాస 12,04,167 35.81
భాజపా 11,95,711 35.56
ఎంఐఎం 6,30,866 18.76
కాంగ్రెస్ 2,24,528 6.67
తెదేపా 55,662 1.66

మారనున్న రాజకీయం...

గ్రేటర్ ఓటర్ల తీర్పుతో పార్టీల బలాబలాలు తారుమారై రాజకీయంగా కూడా పెద్దప్రభావాన్ని చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బల్దియా తీర్పు నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కే పరిస్థితులున్నాయి.

ఇదీ చూడండి:తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...!

ABOUT THE AUTHOR

...view details