Covid Omicron Differences: గత 10-15 రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. సాయంత్రం, ఉదయం వేళల్లో చల్లటి గాలులు వణికిస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చాలామందిని రకరకాల శారీరక రుగ్మతలు వేధిస్తున్నాయి. చర్మం పొడి బారుతోంది. అస్తమా, సీవోపీడీ ఇతర శ్వాసకోశ ఇబ్బందులున్నవారు ప్రభావితమవుతున్నారు. కొందరిలో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో..ఈ అనారోగ్య సమస్యల కారణంపై అయోమయం నెలకొంటోంది. నగరంలోని కొన్ని ఔషధ దుకాణాల వద్ద ‘ఈనాడు- ఈటీవీ భారత్’ ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడు ప్రతి పది మందిలో ముగ్గురు, నలుగురు జ్వరం, జలుబు, దగ్గు, గొంతులో ఇన్‌ఫెక్షన్‌కు ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. చాలా కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు ఇవే సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో నిత్యం వెయ్యిమందికి పైనే ఓపీ ఉంటోంది. చలికాలంలో సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్లు సహజమేనని వైద్యులు పేర్కొంటున్నారు. అయినా కరోనా మూడో దశ విజృంభిస్తున్న తరుణంలో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని సూచిస్తున్నారు.
గుర్తించడం ఎలా..
difference between corona and flu: కరోనా..సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్లలో లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో హైగ్రేడ్ ఫీవర్‌తో పాటు.. ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. పడుకొని లేవాలంటే బాగా నీరసంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గుతో ఆగిపోతే సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా భావించవచ్చని, అయితే ఇది పూర్తిగా వాస్తవమని చెప్పలేమన్నారు. కేవలం దగ్గు, గొంతు నొప్పితో టెస్టు చేయించుకున్న కొందరిలోనూ కరోనా నిర్థారణ అవుతోందన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించామన్నారు. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉన్న వారిని పరీక్షిస్తే... ప్రతి పది మందిలో 8-9 మందిలో కరోనా ఉందని, అదే జ్వరం లేకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్న వారికి కరోనా పరీక్షలు చేస్తే 10 మందిలో ఒకరిద్దరిలోనే వైరస్ బయట పడిందని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులు తెలిపారు. డెల్టా వేరియంట్‌లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం, రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఒమిక్రాన్‌లో ఈ లక్షణాలు ఉండటం లేదని, అందుకే సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్, కరోనా మధ్య గుర్తింపులో కొంత గందరగోళం ఉంటోందన్నారు.