షెడ్యూలు విడులైనా.. రిజర్వేషన్లపై రాని స్పష్టత తెలంగాణలో 120 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా పూర్తి చేయాల్సిన రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు సిద్ధం కాకపోవడం వల్ల రాజకీయ పార్టీలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడానికి మరో వారం రోజులకుపైగా పట్టే అవకాశాలు ఉండటం వల్ల.. అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జనలు పడుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో తర్జనభర్జన
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలతోపాటు వార్డులు ఎవరికి రిజర్వ్ అయ్యాయనేది వెల్లడి కాకుండా ముందుకు వెళ్లడం కుదరదు. ఊహించని విధంగా వార్డుల పునర్విభజన, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే షెడ్యూలు రావడం కాంగ్రెస్, భాజపాలకు ఇబ్బందికరంగా మారింది. శాసన సభ ఎన్నికలతోపాటు సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని చాటిన అధికార పార్టీ.. పురపాలక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. హస్తం, కాషాయం పార్టీలు కూడా ఎక్కువ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
జనవరి 4 లేదా 5 తేదీల్లో ఖరారు..?
రిజర్వేషన్లు జనవరి 4 లేదా 5 తేదీల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లు వెలువడిన తరువాత నామినేషన్లకు గరిష్ఠంగా మూడు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై పార్టీల్లో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఎంపికైనా... నామినేషన్లు వేయడానికి రెండు రోజుల్లోనే సిద్ధం కావాల్సి ఉండడం వల్ల ఆశావహులకు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన పార్టీలు
- తెరాస ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతను అప్పగించింది.
- వార్డుల్లో ఎవరెవరిని బరిలో దింపాలో ఆ పార్టీకి స్పష్టత ఉంది. రిజర్వేషన్ల అంచనాల్లో మార్పులు ఉంటే.. ఆ మేరకు అభ్యర్థులను మార్పు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
- కాంగ్రెస్లో క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక కొంత గందరగోళంగా ఉంది. బరిలో దిగేందుకు ఆశావహులు ఉన్నా.. రిజర్వేషన్లు గుబులు పుట్టిస్తున్నాయి.
- ప్రధానంగా జనరల్, బీసీ స్థానాలపై నేతల్లో సందేహాలు ఉండగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పీసీసీ అప్పగించింది.
"ఈ నెల 30న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు అందుబాటులోకి రానుండగా అదే రోజు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. అభ్యర్థుల ఎంపిక స్పష్టత కోసం 30వ తేదీ వరకైనా ఆగక తప్పదని కాంగ్రెస్, భాజపా నేతలు పేర్కొంటున్నారు"
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'