DIABETIC CASES IN AP: మధుమేహం నియంత్రణలో లేక కొందరు.. దివ్యాంగులుగా మారుతున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. బాధితుల్లో నిరుపేదలు, కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండటం.. మందుల వాడకం గురించి బాధితులూ పట్టించుకోక పోవడం, దురలవాట్లు.. వంటి కారణాలు వారిని జీవచ్ఛవాలుగా మారుస్తున్నాయి.
మధుమేహం తీవ్రత పెరిగి.. ఏపీలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రధాన బోధనాసుపత్రుల్లో నెలకు సగటున 15 నుంచి 20 మంది మోకాలి కింద వరకూ కాళ్లను కోల్పోతున్నారు. మరో 20 మందికి పాదం లేదా కాలి వేళ్లను తొలగించాల్సి వస్తోంది. అనంతపురం GGHలో వైద్యులు నెలకు 15 మంది మధుమేహ బాధితులకు శస్త్రచికిత్సల ద్వారా ఇన్‌ఫెక్షన్లను తొలగిస్తున్నారు.
50ఏళ్ల పైబడిన వారిలోనే ఎక్కువ: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రధాన బోధనాసుపత్రులకు ఓపీలో వచ్చేవారిలో 10నుంచి 15శాతం మంది మధుమేహ నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆరోగ్యం దెబ్బతిన్న వారే ఉంటున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో సమస్యలు ఎక్కువగా బయటపడుతున్నాయి. మధుమేహం వచ్చాక మొదటి పదేళ్లపాటు పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించకపోవడం వల్ల కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మందులు వాడుతున్నాం కదా అని మరికొందరు వైద్యుల దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు. మధుమేహాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా... గుండె, కళ్లు, మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి: శరీరంలో గ్లూకోజు ఎక్కువగా ఉంటే కాళ్లు, చేతులకు రక్త సరఫరా సరిగా ఉండదని.. స్పర్శను కోల్పోతారని...పాదాల్లో నాడులు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. సూదులు పొడిచినట్లు, మండినట్లు అనిపించడం, నొప్పి పుట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయని... పుండ్లు మానకుండా వేధిస్తుంటాయని ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఏలూరులో రైతు కూలీ బాధ: ఏలూరు జిల్లాకు చెందిన రైతుకూలీ.. పనికి వెళ్లినప్పుడు.. పొలంలో పాదంలోనికి ఇనుప మేకు దిగింది. స్థానిక వైద్యం పొందాడు. మళ్లీ మేకు దిగిన భాగంలో పుండు పెద్దది కావడంతో వైద్యులను సంప్రదించకుండా స్థానిక వైద్యాన్ని నమ్ముకున్నాడు. చివరికి కుడి కాలు పాదానికి పూర్తిగా ఇన్‌ఫెక్షన్ సోకింది. ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
15 ఏళ్ల నుంచి మధుమేహం: విజయవాడ శివారు ప్రాంతానికి చెందిన నూకరాజుకు 15 ఏళ్ల నుంచి మధుమేహం ఉంది. చెప్పుల దుకాణంలో పనిచేసే ఈయనకు పదేళ్ల కిందటే గుండెకు రెండు స్టెంట్లు వేశారు. 8 నెలల కిందట ఎండలో నడిచినప్పుడు కాలికి బొబ్బ వచ్చింది. ప్రాథమిక వైద్యంతో మొదట్లో తగ్గినట్లే.. తగ్గి.. కొద్దిరోజులకే పుండు పెద్దదైంది. 4 నెలల కిందట శస్త్రచికిత్స ద్వారా కుడి కాలు మెకాలి కింద భాగాన్ని తొలగించారు. ఇటీవల ఎలుక కొరకడంతో రెండో కాలి పాదానికి గాయమైంది. ఇప్పుడు ఆ కాలినీ తీసేయాలని వైద్యులు చెబుతున్నారు.