రానున్న మూడు నెలలు పండుగల సీజన్ కావడం వల్ల ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్(RTPCR) ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కొవిడ్ రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇన్‌ఫెక్టివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. కరోనా మరణాలు అతితక్కువగానే నమోదవుతున్నాయని శ్రీనివాసరావు వివరించారు.
కొవిడ్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని.. ఈ మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ సూచించారు. మహమ్మారిపై పూర్తిగా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.01 కోట్ల మందికి కనీసం ఒక డోసు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని శ్రీనివాసరావు వెల్లడించారు. 38 శాతం మందికి రెండో డోసు ఇచ్చామని తెలిపిన డీహెచ్.. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని స్పష్టం చేశారు.