తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరాల్లోనే నగదు ఖజానా.. ఎక్కువగా ఆ మూడు జిల్లాల్లోనే..! - మేడ్చల్​లో పెరిగిన బ్యాంక్​ డిపాజిట్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల డిపాజిట్లలో 63 శాతం 3 జిల్లాల్లోనే ఉన్నాయి. భూముల ధరలు బాగా పెరగడం, స్థిరాస్తి జోరు, పరిశ్రమల కారణంగా ఈ మూడు జిల్లాల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. అయితే రుణాలు తీసుకునే వారు తక్కువగా ఉన్నారు.

bank deposits
బ్యాంకు డిపాజిట్లు

By

Published : Jan 29, 2023, 2:16 PM IST

భూముల ధరలు బాగా పెరగడం, స్థిరాస్తి జోరు, పరిశ్రమల కారణంగా రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు పెరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 5,582 బ్యాంకు శాఖల్లో ప్రజలు జమచేసిన డిపాజిట్లు రూ.6,40,566 కోట్లుంటే వీటిలో ఈ మూడు జిల్లాల వారు దాచుకున్నవే 63.75 శాతం ఉండటం గమనార్హం. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సంస్థలు, ప్రజల నుంచి డిపాజిట్లు ఎక్కువగా వస్తున్నాయి.

ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి, మేడ్చల్‌లలో రుణాల పంపిణీ చాలా తక్కువగా ఉంది. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లతో పోల్చితే వివిధ రంగాల్లో ప్రజలకు ఇస్తున్న రుణాలు తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో మొదటి త్రైమాసికంలో బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల సొమ్ము ఎంత, ప్రజలకు ఇచ్చిన రుణాలెన్ని అనే వివరాలను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికిచ్చింది. ఆ వివరాలు..

  • తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రజలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.6,43,750 కోట్లుగా తేలింది. డిపాజిట్లు, రుణాల నిష్పత్తి రాష్ట్ర సగటు తెలంగాణలో 100 శాతంకాగా.. జాతీయ సగటు 74 శాతమని గుర్తించారు. కానీ, జాతీయ సగటుకన్నా రెండు జిల్లాల్లో(రంగారెడ్డి 68 శాతం, మేడ్చల్‌ 70 శాతం) తక్కువగా రుణాల పంపిణీ ఉండటం గమనార్హం.
  • రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో డిపాజిట్లతో పోలిస్తే 222 శాతం, మహబూబాబాద్‌లో 194, జనగామ, నల్గొండలలో 189 శాతం అధికంగా రుణాలివ్వడం విశేషం.
  • అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో రూ.35,496 కోట్ల డిపాజిట్లకు రూ.23,984 కోట్లు రుణాలివ్వగా పంపిణీ నిష్పత్తి 68 శాతంగా ఉంది.
  • సొమ్ము ఎంత ఉందనే లెక్కలను పరిశీలిస్తే అత్యల్పంగా ములుగు జిల్లాలో 27 బ్యాంకుల్లో రూ.861 కోట్ల డిపాజిట్లుంటే రూ.1,025 కోట్ల రుణాలిచ్చారు. ఈ విషయంలో అత్యధికంగా హైదరాబాద్‌లోని 1,210 బ్యాంకుల్లో రూ.3,70,356 కోట్ల డిపాజిట్లుండగా రూ.3,79,026 కోట్లు రుణాలుగా ఇచ్చారు.

అభివృద్ధి పనులకే ఎక్కువ రుణాలు..రాష్ట్రంలో పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు రుణాల పంపిణీ ఎక్కువగా ఉంది. వ్యవసాయానికి తక్కువగా ఉంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రూ.21 వేల కోట్లను రైతులకు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకూ రూ.13 వేల కోట్ల వరకే ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details