department of education: రాష్ట్రంలో 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి బదిలీలు నిర్వహించారు. అప్పటి నుంచి పదోన్నతులు లేవు. కొందరు పదోన్నతి పొందకుండానే రిటైరవుతున్నారు. ఏకీకృత సర్వీస్ నిబంధనల వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నా స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ), ప్రధానోపాధ్యాయుల వరకు యాజమాన్యాల వారీగా (పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలలు) పదోన్నతులు ఇవ్వడానికి ఇబ్బందులు లేవు.
తాజా లెక్కల ప్రకారం దాదాపు 10 వేల మంది పదోన్నతులు పొందుతారు. అందులో 2,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీలు) ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్‌హెచ్‌ఎం)గా, మరో 5 వేల మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి దక్కించుకుంటారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ల నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా 1,970 మంది ఉంటారు.
అయితే ఈ ప్రక్రియకు ముందు కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని నిపుణులు, విద్యాశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులున్నాయి. అంటే కచ్చితంగా 50 రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరించి...పదోన్నతులు ఇవ్వగలరా అన్నది ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
పరిష్కారం చూపాల్సినవి ఇవీ...
- ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితులు, పీఈటీల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ అయిదేళ్ల క్రితమే ప్రకటించారు. ఆ మేరకు 2017, 2019లలో రెండు జీవోలిచ్చారు. వాటిపై ఎస్‌జీటీలు న్యాయస్థానంలో కేసు వేశారు. సర్వీస్ నిబంధనలు మార్చకుండా కేవలం భాషా పండితులు, పీఈటీలకే ప్రయోజనం దక్కేలా ఎలా అప్‌గ్రేడ్ చేస్తారని హైకోర్టు ప్రశ్నిస్తూ స్టే ఇచ్చింది.
- దాంతో సర్వీస్ నిబంధనలను సవరించి 2020 ఫిబ్రవరిలో మళ్లీ జీవోలు 2, 3 ఇచ్చారు. దీనివల్ల 8,630 భాషా పండితులు, 1,849 పీఈటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్‌గ్రేడ్ అవుతాయి. ఎస్‌జీటీలు మళ్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దాంతో అప్‌గ్రెడేషన్‌పై ముందుకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.
- ఎస్‌జీటీలకు అన్యాయం జరగకుండా చూడటంతోపాటు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల(పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులను 10 వేలకు పెంచుతామని 2021 మార్చిలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం 4,207 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులుండగా 2,386 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1,821 ఖాళీలు. కొత్తగా 5,793 కొలువులను మంజూరు చేయాలి. సీఎం ప్రకటించారు కానీ జీవో జారీ కాలేదు.
- 317 జీవో కింద ఈ జనవరిలో కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించారు. పలువురు ఉపాధ్యాయులు తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. సుమారు 500 దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు. కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. వారిని ఏ జిల్లాలకు కేటాయించారో స్పష్టత ఇవ్వకుంటే సీనియారిటీ జాబితా తయారు చేయడం సాధ్యం కాదు.
- కొత్త జిల్లాల వారీగా గవర్నమెంట్(డీఈఓ) పాఠశాలల ఉపాధ్యాయులను కేటాయించారు. అయితే జయశంకర్ భూపాలపల్లి లాంటి జిల్లాల్లో ఒక్క గవర్నమెంట్ పాఠశాల కూడా లేదు. ఇటీవల ఆ జిల్లాకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించారు. ఆయన జిల్లా పరిషత్తు పాఠశాలలో పనిచేస్తున్నారు. పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. మరి వారికి ఎలా పదోన్నతులు కల్పిస్తారు? ఈ సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్నగానే ఉంది.
ఇదీ చదవండి:కాంగ్రెస్‌లో చేరినా తెరాసకు ఐప్యాక్ సేవలు: ప్రశాంత్ కిశోర్
రామ్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆరోగ్యం విషమం