దోమకాటు ప్రమాదకరంగా మారుతోంది. రాష్ట్రంలో డెంగీ(Dengue ) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన వారం రోజుల్లోనే దాదాపు ఎనిమిది వందల మంది దీని బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతనెల చివరి నాటికి రాష్ట్రంలో 1,720 డెంగీ కేసులు నమోదు కాగా... తాజాగా ఆ సంఖ్య 2,509కి చేరింది. అంటే వారం రోజుల్లో 789 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకి సుమారు వంది మందికి పైగా డెంగీ సోకుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
భాగ్యనగరంలో అధికం
భాగ్యనగరంలో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 30శాతం కంటే ఎక్కువ డెంగీ(dengue cases in hyderabad) కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇప్పటివరకు నగరంలో 765మంది డెంగీ బారినపడ్డారు. ఇక భాగ్యనగరం తర్వాత అత్యధికంగా ఖమ్మంలో 354 మందికి వ్యాధి సోకింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా... కొత్తగూడెం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్ కలిపి ఏడు జిల్లాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లోనూ డెంగీ ప్రభావం చూపుతోంది. గతేడాది సీజన్ మొత్తం కలిపినా నమోదైంది కేవలం 1,244 కేసులు మాత్రమే కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 2,509 మందికి డెంగీ సోకడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఆస్పత్రులు కిటకిట
డెంగీతో పాటు మలేరియా(malaria) సైతం రాష్ట్రంలో వేగంగా ప్రబలుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా తీవ్ర రూం దాలుస్తోంది. కొత్తగూడెంలో ఇప్పటివరకు 242మందికి మలేరియా సోకగా... ములుగులో 160మంది మలేరియా జ్వరం బారినపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 608 మందికి మలేరియా సోకినట్లు వైద్య శాఖ ప్రకటించింది. గతనెల చివరినాటికి రాష్ట్రంలో కేవలం 116 మలేరియా కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే గత వారం రోజుల్లో 492 మంది వ్యాధి బారినపడ్డారు. ఇక వీటితో పాటు సాధారణ జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో అనేక కుటుంబాలు జ్వరంతో ముసుగేస్తున్నాయి. కొవిడ్(covid) నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ గణాంకాల ప్రకారం జులై, ఆగస్టు నెలలు కలిపి రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది జ్వర పీడితులు ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి నిత్యం సుమారు వంద మంది జ్వర పీడితులు వస్తున్నట్టు సమాచారం. ఇక నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలోనూ సైతం ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది.
అప్రమత్తత అవసరం
వాతావరణంలో మార్పు, మురుగు నీరు కారణంగా దోమల వ్యాప్తి చెందుతున్నాయి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలకు సీజన్ మొదలవుతుంది. వందల సంఖ్యలో జ్వరబాధితులు ఉంటారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. జ్వరం లక్షణాలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:Be Alert: వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం!!