తెలంగాణ

telangana

ETV Bharat / state

చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

ప్రతిష్టాత్మక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలో అక్రమాలకు తెరలేపారు. ఇవాళ జరగబోయే పరీక్షను ముందు రోజు రాత్రే అక్రమంగా ఓ ప్రైవేటు పాఠశాలలో రాస్తూ అడ్డంగా దొరికారు. విద్యార్థుల నుంచి వేలకొద్దీ డబ్బులు దండుకుంటున్న నిర్వాహకుల ఆగడాలతో రగిలిన ఓ విద్యార్థి మీడియాను ఆశ్రయించగా 'చీకట్లో చూచిరాత' బాగోతం బట్టబయలైంది.

degree-and-pg-exams-copying-found-at-jagadgiri-gutta
చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

By

Published : Dec 14, 2019, 9:15 AM IST

Updated : Dec 14, 2019, 1:18 PM IST

పర్యవేక్షణ లేమితో నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలు గాడితప్పాయి. హైదరాబాద్ జగద్గిరిగుట్ట సక్సెస్ క్రియేటివ్ పాఠశాలలో ఏకంగా ఈరోజు జరగబోయే పరీక్షను ముందు రోజు రాత్రే అక్రమంగా నిర్వహిస్తూ అడ్డంగా దొరికారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చీకట్లో చూచిరాతలు యథేచ్చగా జరగడం గమనార్హం.

మీడియాను చూసి నీళ్లు నమిలిన నిర్వాహకులు

200 మందికిపైగా విద్యార్థులు దర్జాగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా విద్యార్థులు మీడియాకు సమాచారం అందించారు. కెమెరాలను చూసిన నిర్వాహకులు నీళ్లు నమిలారు. సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకోగానే భయంతో పలువురు విద్యార్థులు పారిపోయారు.

గ్యారంటీ పాస్​ కోసమే మాస్ కాపీయింగ్

నాగార్జునవర్సిటీ దూర విద్యా కేంద్రం నుంచి స్టడీ సెంటర్‌గా అనుమతులు తీసుకున్న గీతాంజలి కళాశాల యాజమాన్యం సక్సెస్ క్రియేటివ్ స్కూల్‌లో పరీక్ష నిర్వహించింది. గ్యారెంటీగా పాస్ చేయిస్తామని ఒక్కో విద్యార్థి నుంచి వేల రూపాయలు దండుకుని మాస్‌ కాపీయింగ్‌ని ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

అదుపులోకి కళాశాల ప్రతినిధి

ఇదే తరహాలో ఎల్బీనగర్, రామాంతపూర్, ఎస్సార్​నగర్, జగద్గిరిగుట్ట కేంద్రాలుగా అడ్డగోలు వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. గీతాంజలి జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రతినిధి బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

అందరిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

విద్యను వ్యాపారంగా మార్చి అనర్హులను అందలం ఎక్కించి విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్న వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వివిధ కేంద్రాల్లో సాగుతున్న అక్రమాల నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

ఇదీ చూడండి : రామోజీ ఫిల్మ్‌సిటీలో 'శీతాకాల సంబురాలు'

Last Updated : Dec 14, 2019, 1:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details