Ventilator Accessories Scarcity: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి వెంటిలేటర్ల కొరత లేదని, కానీ వాటిలో వినియోగించే ఉపకరణాలకు తీవ్ర లోటు ఏర్పడుతోందని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. ముఖ్యంగా వెంటిలేటర్లలో ఉపయోగించే తొడుగులు, గొంతులో వేసే గొట్టాలు, ఇతరత్రా ఐసీయూ వైద్యపరికరాలకు కొరత ఉందని తెలిపింది. మూడోదశ కొవిడ్ ఉధ్ధృతిని సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఈ మేరకు పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వెంటిలేటర్ నిర్వహణపైనా 50 శాతం కంటే తక్కువగా మానవ వనరులకు సరైన శిక్షణ లేదని పేర్కొంది. ప్రాణవాయువు పరికరాల నిర్వహణపై సుశిక్షితులైన సిబ్బంది అవసరమని తెలిపింది.
కొవిడ్ చికిత్సకు సమృద్ధిగా ఔషధాలు..
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్, డెక్సామెతజోన్, బ్లాక్ ఫంగస్ వైద్యంలో వినియోగించే పొసకొనజోల్ తదితర ఔషధాలు సమృద్ధిగా ఉన్నాయని నివేదించింది. మెథాల్ ప్రిడ్నిసోలోన్ మందులు మాత్రం నిల్వలేవని పేర్కొంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, విదేశీ సాయం, కేంద్రప్రభుత్వం కింద రాష్ట్రానికి 38 ఆక్సిజన్ ప్లాంటు మంజూరు కాగా 29 నెలకొల్పామని మిగతావాటిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు 1,708 వెంటిలేటర్లు మంజూరు కాగా 1,565 నెలకొల్పామంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొంతమేరకు విడుదలకు నోచుకోలేదని, వాటిని త్వరగా విడుదల చేయాలని ఈ సందర్భంగా వైద్యాధికారులు కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో గత రెండు వారాల్లో ప్రతి 10 లక్షల జనాభాలో 10,911 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద నిఘా కొనసాగించాలని, ముప్పు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేసి పాజిటివ్ వస్తే వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించాలంది. కరోనా వ్యాప్తి చెందకుండా టీకాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని, మాస్కు తప్పనిసరిగా ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొంది.
కొవిడ్ నియంత్రణకు రూ.535 కోట్లు విడుదల..