కరోనా ప్రభావం మెట్రోపై తీవ్రంగా పడుతోంది. లాక్డౌన్ అనంతరం కొద్దికొద్దిగా మునుపటి స్థితికి చేరుకుంటున్న దశలో రెండోదశ కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్ మెట్రో ఎక్కడానికి నగరవాసులు వెనుకడుగు వేస్తున్నారు. మెట్రోలో పూర్తిస్థాయిలో కరోనా నిబంధనలు పాటిస్తున్నా.. జనాల్లో భయం మాత్రం పోవట్లేదు. గతేడాది లాక్డౌన్ వల్ల ఆరు నెలల విరామం తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినా ప్రయాణికుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది.
మెట్రోకు మంచి ఆదరణ ఉంటుందని అధికారులు భావించినా.. ఆశించిన మేర స్పందన రాలేదు. మూడు కారిడార్లలో కలిపి రోజుకు కేవలం 30 వేల మంది మాత్రమే ప్రయాణించారు. మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్ లెస్ టికెటింగ్, శానిటైజేషన్, సామాజిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించడంతో క్రమేనా ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు చేరింది. హైటెక్ సిటీ–నాగోల్ కారిడార్లో ఎక్కువ రద్దీగా ఉండేది. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రోను అధికంగా ఉపయోగించుకునేవారు. అయితే లాక్డౌన్లో చాలా వరకు సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో మెట్రో ఎక్కే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించినా.. 2 లక్షల ప్రయాణికుల కంటే మించిన సందర్భాలు ఉండటం లేదు.