తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న మాతృ మరణాలు.. మంత్రి హరీశ్‌ హర్షం - మాతృమరణాలపై జాతీయ నమూనా సర్వే

Declining maternal mortality: రాష్ట్రంలో మాతృ మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అతి త‌క్కువ ఎమ్​ఎమ్​ఆర్​లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తాజాగా విడుదల చేసిన జాతీయ నమూనా సర్వే- ఎన్​ఆర్ఎస్ ప్రకారం... 56 నుంచి 43 పాయింట్లకు తగ్గిపోయింది. మాతృ మరణాలు తగ్గించడంలో రాష్ట్ర పథకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

sca
sca

By

Published : Dec 1, 2022, 3:52 PM IST

రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న మాతృ మరణాలు.. మంత్రి హరీశ్‌ హర్షం

Declining maternal mortality: రాష్ట్రంలో మాతా, శిశు సంరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేషియో - మెటర్నల్ మోర్టాలిటీ రేషియో గణనీయంగా తగ్గటంలో ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన జాతీయ నమూనా సర్వే 2018-20 ప్రకారం ఎమ్​ఎమ్​ఆర్​ 43 పాయింట్లకు తగ్గింది. 2017-19లో ఇది 56 ఉండగా... ఇప్పుడు ఏకంగా 13పాయింట్లకు తగ్గింది. జాతీయ సగటు 97పాయింట్లుగా ఉండగా... రాష్ట్రం అందులో సగానికి తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎమ్​ఎమ్​ఆర్​ 92 పాయింట్లుగా ఉండగా... ఇప్పటి వరకు 49 పాయింట్లకు తగ్గింది. తాజా నివేదిక ప్రకారం అతి త‌క్కువ మాతృ మ‌ర‌ణాల‌లో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర తొలి రెండు స్థానాల్లో ఉండగా... తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

మాతా శిశు సంరక్షణలో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్లు విప్లవాత్మకమైన మార్పు తెచ్చాయి. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపటం, నెలనెలా పరీక్షలు, అమ్మఒడి వాహనాల సేవలు, అన్ని దశలో నాణ్యమైన వైద్యం అందుతోంది. ప్రతి గర్బిణీకి 4 ఏఎన్​సీ పరీక్షలు చేస్తున్నారు. తొలి 2 పరీక్షలు పీహెచ్​సీ పరిధిలో జరుగుతుండగా... తర్వాత రెండు పరీక్షలను గైనకాలజిస్ట్, పీడియాట్రిషన్, అనస్థీషియా వైద్యులు ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. ఎనీమియా బాధితులను గుర్తించి సప్లిమెంటరీ మాత్రలు అందిస్తున్నారు. ఆశా, ఏఎన్​ఎం ప్రతి గర్భిణీకి ఐరన్ క్యాప్సుల్స్ ఇస్తూ... వినియోగంపై ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. హైరిస్క్ ఉంటే ముందుగానే గుర్తించి అవసరమైన మద్ధతు అందించేందుకు ఆశా, ఏఎన్​ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

గర్భిణులకు కౌన్సెలింగ్, వ్యాయామం చేయిస్తూ మానసికంగా సిద్ధం చేయిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలని ఆశాలు, ఏఎన్​ఎంలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... తమ పరిధిలోని గర్బిణుల ప్రసవం తేదీలను గుర్తించి... ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించేందుకు మిడ్ వైఫరీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వాసుపత్రుల్లో 207 మందిని అందుబాటులో ఉంచి... ఈ మిడ్ వైఫరీ సేవలు అందిస్తున్నారు. ఇలా మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్బిణుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుపుతున్నాయి

రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ చర్యలు మాతృ మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎమ్​ఎమ్​ఆర్​ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయని ఎద్దేవా చేసిన ఆయన.... అత్యధిక మాతృ మరణాల్లో భాజపా పాలిత రాష్ట్రాలే తొలి 3స్థానాల్లో నిలిచాయన్నారు. మాతృమరణాలు తగ్గించటంలో రాష్ట్రాన్ని తొలిస్థానంలో నిలపటమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details