తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని పదేళ్లు పెంచాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇప్పుడున్న 34 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 34 ఏళ్ల వయోపరిమితి విధించడం ద్వారా... 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
సవరించాలి
ఇటివలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయో పరిమితిని 34 ఏళ్లుగా పేర్కొన్న విషయాన్ని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వయో పరిమితిని పదేళ్లు పెంచి.. సవరించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వారి కుటుంబాలను కాపాడాలి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని సామాజిక అత్యయిక పరిస్థితిగా ప్రకటించాలని కోరారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం హైలెవెల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగ యువత కుటుంబాలను కాపాడాలని అన్నారు. వివాహం చేసుకోలేక, జీవితంలో స్థిరపడలేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని.. వారిలో కొందరు నిస్సహాయతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రతుకులను బాగు చేయాలి
గత వారం రోజుల్లో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడటం నిరుద్యోగ సమస్య తీవ్రత, క్షీణించిన యువత పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఉపాధి కల్పించడం తెలంగాణ ఉద్యమం ప్రధాన ఎజెండా మాత్రమే కాదు, రాజ్యాంగ బాధ్యత అని శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని, వారి బ్రతుకులను బాగు చేయాలని సూచించారు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతను, వారి త్యాగాలను గుర్తించి ఆ బిడ్డల జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఇదీ చూడండి :ఆ గ్రామానికి 10 రోజుల పాటు రాకపోకలు బంద్