తెలంగాణ

telangana

ETV Bharat / state

వద్దంటే లోన్‌ ఇప్పించారు.. ఆ మొత్తం దోచేశారు! - సైబరాబాద్​ పోలీస్

రోజురోజుకు సైబర్​ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు ఇరవై నుంచి ముప్పై వరకు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. నిత్యం వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా కార్లు, ద్విచక్రవాహనాలు అమ్ముతామని ఓఎల్‌ఎక్స్‌ ద్వారా జరిగే మోసాలు కొన్నైతే.. బ్యాంకు అధికారులమంటూ.. ఓటీపీ పంపించి కొత్తకోణంలో మోసాలు చేస్తున్నారు. ఈ కోవలోనే చిక్కడపల్లిలో ఓ మహిళ బ్యాంకు లోన్​ అని నమ్మి మోసపోయింది.

Cyder Cheaters Draw rs.5 Lakhs on Women Account in Chikkadapally
వద్దంటే లోన్‌ ఇప్పించారు.. ఆ మొత్తం దోచేశారు!

By

Published : Jul 28, 2020, 2:41 PM IST

మీరు లోన్‌ కావాలా.. అంటూ ఫోనొచ్చిందా? అయితే అస్సలు నమ్మకండి. నమ్మించి.. నిండా ముంచేస్తారు. అవసరం లేదన్నా.. మొహమాటపెట్టి పెద్ద మొత్తంలో బ్యాంకు లోన్​ మంజూరు చేయించి.. ఆ మొత్తాన్ని వాళ్లే దోచేసుకుంటారు. ఈ తరహాలో గడిచిన నెలరోజుల్లోనే ఆరు కేసులు నమోదయ్యాయి. సోమవారం కూడా అలాంటి కేసు ఒకటి నమోదైంది. చిక్కడపల్లికి చెందిన సంగీతకు యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీకు లోన్‌ కావాలా.. అంటూ ఓ ఫోన్​ వచ్చింది. నాకెలాంటి లోన్​ అవసరం లేదని సదరు మహిళ చెప్పినా.. ఆమెను మభ్యపెట్టి, ఆశపెట్టి లోన్​ తీసుకోవాల్సిందేనంటూ పట్టు బట్టి చివరికి లోన్​ తీసుకోడానికి ఒప్పించారు.

తంతగమంతా పూర్తి చేసి.. రూ.4.70 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని సంగీత ఖాతాలో జమ చేయించారు. మీ ఖాతాలో డబ్బు జమ అయిందని సంగీత మొబైల్​కు ఓ మెసేజ్​ వచ్చింది. కొద్ది సేపటికే.. మీ ఖాతాలోంచి రూ.5 లక్షలు డ్రా అయినట్లు సందేశం వచ్చింది. వెంటనే బాధితురాలు బ్యాంక్‌ను సంప్రదించగా మీ ఖాతాలో డబ్బు జమ, విత్‌డ్రా కూడా అయ్యాయని చెప్పారు. మోసపోయాయని తెలుసుకున్న సంగీత సైబరాబాద్​ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫోన్​ కాల్స్​, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్​ నేరాలు పెరుగుతున్న క్రమంలో లావాదేవీలు, డిజిటల్​ లావాదేవీలు, ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్​ ఇన్​స్పెక్టర్​ ప్రశాంత్ తెలిపారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details