Polavaram Project Back Water Dispute: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావంపై ఇవాళ కేంద్ర జల సంఘం సాంకేతిక కమిటీ దిల్లీలో సమావేశమైంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ రుష్విందర్ వోరా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏపీ, తెలంగాణ, ఒడిశా ప్రతినిధులు, పీపీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కోరిన ముంపు ప్రాంతాల ఉమ్మడి సర్వేకు సీడబ్ల్యూసీ అంగీకారం తెలిపింది. ముర్రేడు, కిన్నెరసాని, మరో 6 పెద్దవాగులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేంద్రానికి పంపినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను సీడబ్ల్యూసీ నమోదు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ జలసౌధలో ప్రాజెక్టు ముంపుపై ఇంజినీర్లు కసరత్తు చేసి లేఖను పంపినట్లు సమాచారం.
అభ్యంతరాలివీ..: 2010లో ఆమోదించిన పోలవరం డీపీఆర్ ప్రకారం నెల్లిపాక నుంచి భద్రాచలం, భద్రాచలం ఎగువభాగాన ఎడమవైపు 3 కిలోమీటర్లు, కిన్నెరసాని కలిసేచోట నుంచి ఎగువన 3 కిలోమీటర్లు, భద్రాచలం రోడ్డు బ్రిడ్జి వరకు కుడివైపు, బూర్గంపాడు టౌన్, గుమ్ములూరు-రెడ్డిపాలెం, సారపాక గ్రామాలు మునిగిపోకుండా చూడాలి.
- ఆంధ్రప్రదేశ్‌లో 7 మండలాలు కలిసిన తర్వాత కూడా బూర్గంపాడుపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 11వ సమావేశంలోనూ.. 300 ఎకరాలు తెలంగాణలో ముంపునకు గురవుతాయని.. రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ పేర్కొన్న విషయాన్ని తాజాగా నివేదించినట్లు సమాచారం.
- తెలంగాణ నీటిపారుదలశాఖ గతేడాది చివర్లో జరిపిన అధ్యయనం ప్రకారం 891 ఎకరాలు ముంపునకు గురవుతుంది. ఈ భూమి బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోతె, ఇరవెండి, తూరుబాక, మోదువాయి కాలనీలో ఉంది. భద్రాచలంలో 8 ఔట్‌ఫాల్ రెగ్యులేటర్లు ఉంటే మూడు ముంపునకు గురవుతాయంటూ ఇందుకు సంబంధించిన ఆధారాలను జత చేసినట్లు సమాచారం.
ఇవీ చూడండి..
Polavaram Project Dispute : 'పోలవరం ముంపుపై ఆధారాలున్నాయి'
ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ.. వాటిపై నివేదిక ఇవ్వాలని సూచన