తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యాన ప్రయోగశాల.. ఆధునిక పద్ధతుల్లో తోటల పెంపకం - వ్యవసాయంలో కొత్త పద్ధతులు

రాష్ట్రానికి ఏటా 18 లక్షల టన్నుల వరకూ వేరే రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. అలాగే మామిడి, బత్తాయి తప్ప తక్కిన రకాల పండ్లన్నీ ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అవే పంటలను తెలంగాణలోనూ పండించవచ్చని ఐఐహెచ్​ఆర్​ సిఫార్సు చేసింది. ఎందుకంటే...

ఉద్యాన ప్రయోగశాల
cultivation-of-fruits

By

Published : Oct 25, 2021, 11:53 AM IST

గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను విభజించే సరిహద్దు రేఖ. గోదావరికి అవతల ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌, బస్తర్‌ జిల్లాలు ఉండగా ఇవతల తెలంగాణలోని ములుగు, జయశంకర్‌, భద్రాద్రి, ఏపీలోని గోదావరి జిల్లాలున్నాయి. ఇతర దేశాల్లో వ్యవసాయంలో వాడుతున్న కొత్త టెక్నాలజీని ప్రత్యక్షంగా వెళ్లి చూసి నేర్చుకొని వచ్చో లేదా ఇంటర్‌నెట్‌లో చూసో ఛత్తీస్‌గఢ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. జామ, సీతాఫలం వంటి పండ్ల తోటలను సాధారణ బీర, కాకర మాదిరిగా తీగలపై అల్లుకునే విధానం అమలు చేస్తున్నారు. జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ రీసెర్చ్‌- ఐఐహెచ్‌ఆర్‌) రాష్ట్ర ఉద్యానశాఖల తాజా అధ్యయనంలో ఈ విషయం గుర్తించారు. ‘‘అవే పంటలను గోదావరికి ఇవతల ఉన్న తెలంగాణ ప్రాంతంలోనూ అద్భుతంగా పండించవచ్చు. సారవంతమైన భూములున్నాయి. వాతావరణం అనుకూలం. ఈ దిశగా రైతులను చైతన్యపరచాలి’’ అని ఐఐహెచ్‌ఆర్‌ సిఫార్సు చేసింది. రాష్ట్రానికి ఏటా 18 లక్షల టన్నుల వరకూ వేరే రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. అలాగే మామిడి, బత్తాయి తప్ప తక్కిన రకాల పండ్లన్నీ ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి.

మొక్కలు పెరిగేటప్పుడే తీగలపై అల్లుకునేలా

జామ, సీతాఫలం తోటలో ప్రతీ ఒక వరసలో 12 అడుగులకొక సిమెంటు స్తంభం పాతారు. స్తంభాల మధ్య 3 వరసల్లో ఇనుప తీగలు వేశారు. మొక్కలు పెరిగేటప్పుడే ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరించి అవి ఈ తీగలపై అల్లుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తీగలపై కాసే ప్రతీ పండును జాగ్రత్తగా కవర్‌ చుట్టి ఒక్కోటి 600 నుంచి 1,000 గ్రాముల సైజుకు వచ్చేలా పెంచుతారు. వాటిని ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ వంటి నగరాలతో పాటు ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు. కిలో సీతాఫలాలను రూ.500కు అమ్ముతున్నారు.

‘‘ఎకరా జామ, సీతాఫలం తోట సాగు ప్రారంభించాలంటే తొలి ఏడాది రూ.6 లక్షల వ్యయం, రెండో ఏడాది నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి అవుతోంది. 4వ ఏడాది నుంచి ఏటా రూ.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వస్తోంది’’ అని రైతు అమిత్‌ వెల్లడించారు.

టమాటాకు కర్రలతో పందిరి

ఫొటోలో కనిపిస్తున్న టమాటా మొక్కలు నేలపై ఉండకుండా ఎత్తు పెరిగేలా కర్రలతో పందిరి కడుతున్నారు. టమాటాలు నేలపై ఉంటే మచ్చలు వస్తాయని, అవి కర్రలపై పెరిగి కొమ్మలపైనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎకరాకి 40 నుంచి 50 టన్నులదాకా దిగుబడి వస్తుందని అమిత్‌ వివరించారు. ఇలాగే వంగ, క్యాప్సికం తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నామన్నారు.

వియత్నాం నుంచి డ్రాగన్‌ఫ్రూట్‌ విత్తనం

స్వయంగా ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి రెండురోజుల పాటు పంటల సాగును క్షుణ్ణంగా పరిశీలించామని అమిత్ తెలిపారు. రైతులు ఎంతో శ్రద్ధగా పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలైనా వారు ఎన్నో రకాల కొత్త సాగు పద్ధతులను అమలు చేస్తున్నారని... డ్రాగన్‌ఫ్రూట్‌ విత్తనం వియత్నాం నుంచి తెచ్చి ఎకరానికి 15 టన్నుల దిగుబడి సాధిస్తున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనం, ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ కూలీ రేట్లకే కూలీలు లభించడం వల్ల పంటలపై ఆదాయం ఎక్కువగా వస్తున్నట్లు మా అధ్యయనంలో గుర్తించామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Organic Farming: రైతులకు మెలకువలు కీలకం.. ప్రోత్సాహకాలూ అవసరం

Paddy Crop in Telangana: 'వరిసాగు తగ్గాలి.. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి!'

Rains effect: వర్షాలతో నీట మునిగిన పంటలు.. ఆవేదనలో అన్నదాతలు

ABOUT THE AUTHOR

...view details