ఐదో విడత హరితహారంపై సీఎస్ ఎస్కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నందున హరితహారంలో భాగంగా భారీ ఎత్తున మొక్కలు నాటించాలని సూచించారు. నాటిన మొక్కల సంఖ్య కంటే వాటిని బతికించే విధానంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని సీఎస్ కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హరితహారం కోసం ఏడు కోట్ల రూపాయలు సమకూర్చుకున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డిని అభినందించారు. అన్ని జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, పరిశ్రమలు హరితహారంలో తమవంతు పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు.
మొక్కల రక్షణ కోసం ఉపాధి హామీ నిధులతో అనుసంధానం చేసి వాచర్లను నియమించాలని సూచించారు. క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో అధికశాతం స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదిగే మొక్కలనే నాటాలని జోషి తెలిపారు. బుధవారం పదవీ విరమణ చేయనున్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝాను సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు సమావేశంలో అభినందించారు.