రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలను జనవరి 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులనుఆదేశించారు. రహదారి భద్రత చర్యలపై పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి బీఆర్కే భవన్లో సమావేశం నిర్వహించారు. చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను పంపాలని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించారు.
పటిష్ఠంగా డేటా...
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటా సేకరణను మరింత పటిష్ఠంగా సేకరించడానికి జియో కో ఆర్డినేట్, ఫోటోగ్రాఫ్లతో యాప్ను అభివృద్ధి చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సరైన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. స్పీడ్ గన్స్ కెమెరాలతో ప్రత్యేక సెక్యూరిటీ సేప్టీ ప్లాన్ను రూపొందించి అవసరమైన చర్యలను అమలు చేయాలని తెలిపారు. ట్రామా కేసులకు తక్షణ వైద్య సాయం అందించేలా యూనిఫైడ్ అంబులెన్స్ నెట్ వర్క్, ట్రామా సెంటర్స్ లాంటి అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.