తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎండ, వాన ఏదొచ్చినా సిద్ధంగా ఉండండి: సీఎస్​

వేసవి సీజన్​తోపాటు, రానున్న నైరుతి రుతుపనాల సమయంలో అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు ఇంకా కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని... రైతులకు అవసరమైన సూచనలు ఇవ్వాలన్నారు.

ఎస్కే జోషి

By

Published : May 29, 2019, 7:11 PM IST

ఎండ, వాన ఏదొచ్చినా సిద్ధంగా ఉండండి: సీఎస్​

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపనాలు నేడు అండమాన్​లోకి... జూన్ 10 లేదా 11న రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి. విపత్కర పరిస్థితులు ఎదుర్కొవడానికి అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని, రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూంల ద్వారా ఎప్పటికప్పుడు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రత్యేక దృష్టి

జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభానికి ముందే తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాలతోపాటు, పట్టణాలలో అత్యధిక వర్షపాతం సమయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతో పాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

వ్యాధుల పట్ల అప్రమత్తం

వర్షపాత వివరాలు రోజువారీగా అందిస్తామన్నారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి. రైల్వే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. వర్షకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి వివరించారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధుల పై ప్రత్యేక దృష్టి సారించామని... సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు.

195 సంచార బృందాలు

వర్షకాల సీజన్ దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ పరిధిలో 195 సంచార బృందాలు పనిచేస్తాయని, సన్నద్ధతపై ఇప్పటికే సంబంధిత శాఖలతో సమావేశాలు నిర్వహించామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఎన్ఆర్ఎస్ఏ సహకారంతో వరదపటాలు రూపొందిస్తున్నామని... విపత్తు స్పందన బృందాలు 24 గంటల పాటు పనిచేస్తాయన్నారు. నాలాల పూడికతీతను జూన్ 6 నాటికి పూర్తి చేస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నామని కమిషనర్ తెలిపారు. మెట్రోరైల్ మార్గంలో హోర్డింగ్స్ తొలగించామన్న దానకిషోర్... శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.

హెలిప్యాడ్​ల ఏర్పాటు

జీహెచ్ఎంసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూన్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. పట్టణ, గ్రామీణ రహదార్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, కూలిన చెట్ల తొలగింపునకు చర్యలతో పాటు అవసరమైన హెలిప్యాడ్​ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆర్​అండ్​బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ. గోదావరి నదీ పరివాహక పరిధిలో ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి వరదకట్టలను పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. రైల్వే సహకారంతో ట్రాక్​లపై అప్రమత్తంగా ఉంటామని... ఎన్​డీఆర్​ఎఫ్​ అప్రమత్తంగా ఉందని, అవసరమైన బోట్లు, యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇవీ చూడండి: ఐటీగ్రిడ్​ ఎండీ ముందస్తు బెయిల్​పై విచారణ వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details