తెలంగాణ

telangana

ETV Bharat / state

Crop Booking: పంట నమోదుకు ‘క్రాప్‌ బుకింగ్‌’ మొబైల్‌ యాప్‌ - Telangana News

Crop Booking: పంట నమోదుకు వ్యవసాయశాఖ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రతి రైతు పొలం వద్దకు అధికారి ప్రత్యక్షంగా వెళ్లి ఫొటోలు తీసి అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో నమోదు(అప్‌లోడ్‌) చేసేందుకు ‘క్రాప్‌ బుకింగ్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది.

Crop
Crop

By

Published : May 8, 2022, 6:15 AM IST

Crop Booking: పంటల సాగు వివరాల నమోదులో తప్పులు, పైర్లకు సోకుతున్న తెగుళ్లను సకాలంలో గుర్తించలేకపోవడం, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయశాఖ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో ప్రతి జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ), మండల వ్యవసాయాధికారి(ఏఓ), వ్యవసాయ సబ్‌ డివిజన్‌ సహాయ సంచాలకుడు(ఏడీఏ), గ్రామస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)ల విధులను ఆన్‌లైన్‌లో రోజువారీ పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి రైతు పొలం వద్దకు అధికారి ప్రత్యక్షంగా వెళ్లి ఫొటోలు తీసి అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో నమోదు(అప్‌లోడ్‌) చేసేందుకు ‘క్రాప్‌ బుకింగ్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది. పొలాల సర్వే నంబర్ల వారీగా వారి పర్యటనలన్నింటినీ జియో ట్యాగింగ్‌ ద్వారా లెక్కించేందుకు రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ నుంచి ఉపగ్రహంతో చిత్రీకరించేందుకు ఆ యాప్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల డీఏఓ, ఏడీఏ, ఏఓ, ఏఈఓ ఏరోజు ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్ల పొలాల వద్దకెళ్లారో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయానికి తెలిసిపోతాయి. ప్రతిరోజూ వారు ఎంత దూరం ప్రయాణించారనే వివరాలు తెలుస్తాయి. ఆన్‌లైన్‌ ద్వారా వీటి ఆధారంగా వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులిస్తారు.

వారానికోమారు లక్ష్యం కేటాయింపు:ప్రతి సోమవారం ఒక్కో అధికారికి 2 గ్రామాల్లో 40 సర్వే నంబర్లను కంప్యూటర్‌ కేటాయిస్తుంది. ఆ తరవాత వచ్చే శనివారం(6 రోజుల)లోగా ఆ సర్వే నంబర్ల పొలాలకెళ్లి చూసి ఫొటోలు తీసి వివరాలు యాప్‌లో పంపాలి. రైతులు ఏపంట వేశారు? వాటికి ఏమైనా తెగుళ్లున్నాయా? అనేది గుర్తించి తీసిన ఫొటోను అక్కణ్నుంచే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. జియో ట్యాగింగ్‌ ద్వారా ఆ సర్వే నంబరు పొలం నుంచే అప్‌లోడ్‌ చేశారా? లేదా అనేది వ్యవసాయశాఖ గుర్తిస్తుంది.

మా బాధలూ పట్టించుకోండి:రైతుల వద్దకెళ్లారా లేదా అనేది ఆన్‌లైన్‌ ద్వారా గుర్తించడానికి ముందు తమ సమస్యలు కూడా పరిష్కరించాలని ఏఓలు, ఏఈఓలు వ్యవసాయశాఖను కోరుతున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుకు రైతుల వివరాల నమోదు, ఇతర శాఖల కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే ఆదేశాల వల్ల ఒక్కోసారి తాము పొలాలకు వెళ్లలేకపోతున్నట్లు చెబుతున్నారు. పొలాలకు వెళ్లడానికి తమకు ఖర్చులు చెల్లించడం లేదన్నారు. ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ సరిగా లేక తాము ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం సమస్యగా మారుతోందని తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోంది: రాహుల్‌గాంధీ

డ్రైవర్​ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.2కోట్ల జాక్​పాట్

ABOUT THE AUTHOR

...view details